AP News : పవన్ కల్యాణ్ శ్రమదాన వేదిక కాటన్ బ్యారేజీ నుంచి హుకుంపేటకు మార్పు

by srinivas |
AP News : పవన్ కల్యాణ్ శ్రమదాన వేదిక కాటన్ బ్యారేజీ నుంచి హుకుంపేటకు మార్పు
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలోని రోడ్ల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై నిర్వహించిన ఉద్యమం సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే రోడ్లను ప్రభుత్వం బాగు చేయాలని, లేని పక్షంలో అక్టోబర్ 2న తానే శ్రమదానం చేస్తానని పవన్ హెచ్చరించారు అందులో భాగంగా అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి పర్వదినాన రాజమండ్రి కాటన్ బ్యారేజీపై శ్రమదానం నిర్వహిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాటన్ బ్యారేజీపై శ్రమదానం నిర్వహించేందుకు పోలీసులు, ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ శ్రమదానం చేసి తీరతామని జనసేన పార్టీ ప్రకటించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ అధికారులు గురువారం సాయంత్రం కాటన్ బ్యారేజీపై రోడ్డుకు మరమ్మతులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ శ్రమదాన వేదికను జనసేన పార్టీ మార్చింది. ఈ కార్యక్రమాన్ని హుకుంపేటలోని బాలాజీపేటకు మార్చారు. అక్కడి కనకదుర్గమ్మ గుడి వద్ద సభ అనంతరం శ్రమదానం చేస్తారని పార్టీ వెల్లడించింది. శనివారం ఉదయం పవన్ కల్యాణ్ రాజమండ్రి చేరుకుంటారు. ఉదయం 9 గంటలకు హుకుంపేట సమీపంలోని బాలాజీపేట కనకదుర్గమ్మ గుడి దగ్గర జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం హుకుంపేట సమీపంలో శ్రమదానంలో పాల్గొంటారు. అక్కడ నుంచి అనంతపురం జిల్లా పుట్టపర్తికి పవన్ కల్యాణ్ బయలు దేరతారని జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.

Next Story

Most Viewed