కాంగ్రెస్‌ను దిగజార్చి కమలం గూటికి..!

by Anukaran |   ( Updated:2020-12-16 09:17:16.0  )
కాంగ్రెస్‌ను దిగజార్చి కమలం గూటికి..!
X

దిశ, వెబ్‌డెస్క్: వర్షాలకు వచ్చిన వరదల్లాగ తెలంగాణ బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతుంటే.. వరదల్లో కొట్టుకుపోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ తీరు తయారైంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలో చేరికలు జోరందుకుంటున్నాయి. కార్యకర్తల నుంచి మొదలుపెడితే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇప్పటికే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఓ పక్క రాష్ట్రంలో వర్గ పోరును భరిస్తూ, పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఆ పార్టీ నేతలే ఊహించని షాకులు ఇస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా తయారవుతోందని ఆ పార్టీని వీడుతున్న నేతలే కుండ బద్ధలు కొడుతున్నారు. దీంతో అధిష్టానానికి సైతం ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది.

కాంగ్రెస్‌ను తిట్టి బీజేపీలోకి..

తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏ.చంద్రశేఖర్ బీజేపీలోకి చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 28న బీజేపీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ వార్త కాంగ్రెస్ కీలక నేతలు కష్టంగా జీర్ణించుకున్నప్పటికీ.. ఆయన పార్టీపైన చేసిన వ్యాఖ్యలతో మాత్రం తలలు పట్టుకున్నంత పనైంది. బీజేపీలోకి చేరుతున్నాను అని చెబుతూనే చంద్రశేఖర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని చెప్పారు. పార్టీలో అన్ని కులాల వారికి న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఇదే సమయంలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం వేగంగా పుంజుకుంటున్న బీజేపీకి కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలే మరింత జోష్ నిస్తున్నాయని.. ఇదే సమయంలో కాంగ్రెస్‌ను బలహీన పరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కీలక నేతల్లో నిరాశ..

పార్టీ మారిన నేతలు కాంగ్రెస్‌ స్థాయిని మరింత దిగజార్చుతూ వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ కీలక నేతలు కూడా సైతం తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. దీనికితోడు గ్రేటర్ ఎన్నికలకు బాధ్యత వహిస్తూ ఉత్తమ్ రాజీనామాతో పార్టీ క్యాడర్‌ మొత్తం సందిగ్ధతలో పడింది. వర్గ పోరు కొనసాగుతున్న తరుణం, టీపీసీసీకి ఆశావహులు పెరడగంతో ఆ పదవి ఎవరికి ఇస్తారో అన్న అంశంపై ఇప్పటికీ అధిష్టానం పక్కా సమాచారం ఇవ్వలేదు. పదవి మాత్రం దోబుచులాడుతూ క్యాడర్‌ను మరింత టెన్షన్ పెడుతుంది. తమను కాదని టీపీసీసీ పదవి మరొకరికి ఇస్తే ఆ నేతలు సైతం బీజేపీలోకి చేరుతారన్న వార్తలు హస్తం పార్టీలో కలవరం రేపుతున్నాయి. ఇటువంటి పరిణామాల మధ్య తెలంగాణలో హస్తం పార్టీ ఆందోళనలో పడింది.

Advertisement

Next Story

Most Viewed