నన్నే అరెస్టు చేశారు…వాళ్లెంత?: చంద్రబాబు

by srinivas |
నన్నే అరెస్టు చేశారు…వాళ్లెంత?: చంద్రబాబు
X

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పోలీసుల తీరుపై మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, పోలీసులు పోలీసుల్లా పనిచేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. 151 సెక్షన్ ఉపయోగించి నన్నే అరెస్ట్ చేశారు..అలాంటి పోలీసులు సామాన్యులకు న్యాయం చేస్తారా? అని అడిగారు. గతంలో ఎప్పుడన్నా ఓ డీజీపీ కోర్టుకెళ్లడం గానీ, 6 గంటల పాటు కోర్టులోనే 151 సెక్షన్‌ను చదివించిన సందర్భం ఏదైనా ఉందా? అని నిలదీశారు. అఫిడవిట్ వేసిన తర్వాత ఇది రైటా, రాంగా అంటే తప్పు అని ఒప్పుకున్న డీజీపీ మీరు తప్ప ఎవరైనా ఉన్నారా? అని గౌతమ్ సవాంగ్‌పై ధ్వజమెత్తారు.

డీజీపీకి విశ్వసనీయత ఉందా? అని అడిగిన బాబు, పోలీసు టెర్రరిజం అని అందుకే అంటున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పోలీసులు, వైఎస్సార్సీపీ నేతలు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజా భక్షకులుగా ఉండకుండా, ప్రజా రక్షకులుగా నిలబడండని ఆయన హితవు పలికారు. పోలీసులు ఊడిగం చేయడం మాని, సమాజసేవ చేయాలని హితవు పలికారు. మాచర్ల నిందితులపై 307 సెక్షన్ నమోదు చేస్తామని చెప్పిన ఐజీ, స్టేషన్ బెయిల్ ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అడిగేవాళ్లు లేరని తమాషాలు పడుతున్నారా? అని నిలదీశారు.

వైఎస్సార్సీపీ నాయకులతో కుమ్మక్కై భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేస్తుంటే అడ్డుకున్నారని, అభ్యర్థులు మారువేషాలు వేసుకుని నామినేషన్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంలో కూడా పలు సంఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన విమర్శించారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు.

అరాచకాన్ని వ్యవస్థీకృతం చేశారని ఆయన పోలీసులు, అదికార పార్టీపై విమర్శిలు గుప్పించారు. అధికారం ఉంది కాబట్టి.. మేమే నామినేట్ చేసుకుంటాం, ఇతరులెవ్వరూ పోటీ చేయొద్దు అని ప్రకటించి ఉంటే ప్రజలకు ఈ బాధలు తప్పేవని ఆయన నిట్టూర్చారు. అదికార పార్టీ నేతలు ఉగ్రవాదుల కంటే దారుణంగా తయారయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఎవరి ధన, మాన, ప్రాణాలకూ రక్షణ ఉండకపోవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతోందన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.

Tags: politics, chandrababu, ap, mangalagiri, police, ysrcp, tdp

Advertisement

Next Story

Most Viewed