- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరీక్షలు పూర్తి కాలే… కౌన్సెలింగ్ కు సిద్ధం
యూనివర్సిటీలు, ఉన్నత విద్యామండలి ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో లక్షలాది మంది విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. పరీక్షలతో సంబంధం లేకుండా ఎంట్రన్స్ ప్రక్రియను చేపట్టడంతో స్టూడెంట్స్ నష్టపోతున్నారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో యూజీ ఫైనలియర్, సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇవి ఓ కొలిక్కి రాకముందే ఉన్నత విద్యామండలి సెట్స్ కౌన్సెలింగ్ ను ప్రకటించింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: లాక్‌డౌన్ కారణంగా పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కరోనా జాగ్రత్తలతో సెప్టెంబర్ నుంచి యూనివర్సిటీలు ఫైనలియర్ పరీక్షలు నిర్వహించాయి. ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ లోపునే ఐసెట్, లాసెట్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. కన్వీనర్లు కూడా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. డిగ్రీ సర్టిఫికెట్లు లేకుండా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉండదు. దీంతో విద్యార్థులు డిగ్రీ ఫలితాలు వెలువడే వరకూ కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని కోరుతున్నారు. కాకతీయ, మహాత్మాగాంధీ తదితర యూనివర్సిటీల్లో డిగ్రీ ఫైనల్ సెమిస్టర్స్ ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. టీఎస్ ఐసెట్‌ను కాకతీయ యూనివర్సిటీ, లాసెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించింది. ఓయూ స్వయంగా లాసెట్ నిర్వహించినా అందుకు అవసరమైన డిగ్రీ పరీక్షల గురించి కనీసం సమన్వయం లేకపోవడం గమనార్హం.
ఓయూ పరిధిలో లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఫైనలియర్ పరీక్షలను రోజుకు మూడు చొప్పున నిర్వహిస్తున్నారు. డిగ్రీ బ్యాక్‌లాగ్ ఉన్న విద్యార్థులు కూడా ఐసెట్, లాసెట్‌లో అర్హత సాధించి, డిగ్రీ పట్టా కోసం ఎదురు చూస్తున్నారు. ఇది దృష్టిలో ఉంచుకుని బ్యాక్‌లాగ్, రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులకే ఇది వర్తిస్తోంది. ఓయూ దూరవిద్యా కేంద్రం ఇప్పటివరకూ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయలేదు. సెట్స్‌లో అర్హత సాధించినా ప్రొఫెషనల్ కోర్సుల్లో సీటు పొందలేకపోతున్నామంటూ బ్యాక్‌లాగ్స్ ఒకటి, రెండు సబ్జెక్టులు ఉన్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు పూర్తయ్యేవరకూ కౌన్సెలింగ్ వాయిదా వేయాలని కోరుతున్నారు. ఓయూ దూర విద్యా కేంద్రం అధికారులు మాత్రం కౌన్సెలింగ్‌కు డిగ్రీ పరీక్షలకు సంబంధం లేదని చెబుతుండటం గమనార్హం. ఇలాంటి సమస్యలను విద్యార్థి ముందుగానే చూసుకోవాలని, తమ బాధ్యత ఉండదని సీడీఈ పరీక్షల విభాగం అధికారి వివరించారు.
గతంలోనూ ఇలాగే…
గతంలో నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్ కూడా ఇలాగే గందరగోళంగా పూర్తయింది. ఎంసెట్‌లో అర్హత సాధించినప్పటికీ ఇంటర్‌లో 45శాతం మార్కులు లేని విద్యార్థులను అనర్హులుగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం 35శాతం గ్రేస్ మార్కులతో అందరిని పాస్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఉన్నత విద్యామండలి మళ్లీ ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించి వారికి సీట్లు కేటాయించింది. కొవిడ్ పాజిటివ్, ఇతర వ్యక్తిగత కారణాలతో పరీక్షలు రాయలేకపోయిన వారిని కూడా ఇంటర్ ఉత్తీర్ణులుగా ప్రకటించడంతో వారికి మరోసారి ఎంసెట్ నిర్వహించింది. అర్హత పొందినవారికి మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించక తప్పలేదు. ప్రభుత్వ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఉన్నత విద్యామండలి ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించడంతో ఈ సమస్య ఎదురైంది.
కౌన్సెలింగ్ వాయిదా వేయాలి…
ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఓయూ డిస్టెన్స్ ఎడ్యూకేషన్‌లో డిగ్రీ పూర్తి చేశాను. సెకండియర్‌లో ఒక సబ్జెక్టు ఉండిపోయింది. సప్లిమెంటరీ ఫీజు కూడా చెల్లించాను. ఎన్ని సార్లు తిరిగినా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం పరీక్షల షెడ్యూల్ ప్రకటించాలని కోరినా స్పందించడం లేదు. లాసెట్ మూడేండ్ల కోర్సు కోసం రాశాను. క్వాలిఫై అయినా ఇప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ లేకపోవడంతో కౌన్సెలింగ్‌కు వెళ్లలేను. పరీక్షలు అయ్యే వరకూ కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలి. – నాగరాజు
విద్యార్థులు నష్టపోకుండా చూడాలి…
చాలా యూనివర్సిటీల్లో ఇంకా డిగ్రీ ఫలితాలు ప్రకటించలేదు. ఐసెట్, లాసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు వేలల్లో ఉన్నారు. వారందరూ డిగ్రీ మెమోలు లేకుండా కౌన్సెలింగ్‌కు వెళ్లలేని పరిస్థితి. అందుకు విద్యార్థులకు నష్టం జరగకుండా అన్ని యూనివర్సిటీలు డిగ్రీ పరీక్షలపై ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదా కౌన్సెలింగ్ అవకాశం కోల్పోకుండా క్వాలిఫై అయిన స్టూడెంట్స్‌కు వెసులుబాటు కల్పించాలి. సప్లిమెంటరీ పరీక్షలు ముగిసిన తర్వాత మెమో ఇచ్చేలా అయినా చూసి విద్యార్థులు నష్టపోకుండా చూడాలి. – మూర్తి, ఎస్ఎఫ్ఐ, రాష్ట్ర అధ్యక్షుడు