‘సరిహద్దులో రోడ్ల నిర్మాణంపై వెనక్కి తగ్గేది లేదు’

by Shamantha N |
‘సరిహద్దులో రోడ్ల నిర్మాణంపై వెనక్కి తగ్గేది లేదు’
X

న్యూఢిల్లీ: భారత సార్వభౌమత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని, ప్రస్తుత ఆపత్కాలంలోనూ దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తే తిప్పి కొడతామని ప్రధాని చెప్పినట్టుగానే హోంశాఖ తన పని తాను చేసుకుంటూ పోతున్నది. సరిహద్దులో నెలకొన్న ఘర్షణలపై ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నా, జూన్ 15 నాటి హింసాత్మక ఘర్షణలకు కారణంగా భావిస్తున్న రోడ్ల నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. సరిహద్దుకు సమీపంలో భారత భూభాగంలో చేపడుతున్న ఈ నిర్మాణాలను వేగంగా ముగించాలని సమీక్షా సమావేశంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా, సోమవారం ఇండియా, చైనాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి సమావేశం జరిగింది. అయితే, సమావేశంలో చర్చించిన విషయాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు. సరిహద్దులో మే నెలలో మొదలైన ఉద్రిక్తతల పరిష్కారానికి, బలగాలు వెనక్కి తగ్గడానికి జూన్ 6న ఈ స్థాయి మిలిటరీ చర్చలు జరిగాయి. తర్వాత జూన్ 15నాటి ఘర్షణల ఉద్రిక్తతలు సమసిపోయేందుకు సోమవారం మరోసారి లెఫ్టినెంట్ జనరల్ స్థాయి సమావేశం జరిగింది. ఒకవైపు ఈ సమావేశాలు జరుగుతుండగానే, చైనా మౌత్‌పీస్‌గా పరిగణించే ‘గ్లోబల్ టైమ్స్’ పత్రిక జూన్ 15న చైనా సైనికుల మరణాలపై స్పందించింది. ఆ హింసాత్మక ఘర్షణల్లో చైనాకు చెందిన కమాండింగ్ ఆఫీసర్ మరణించాడని పేర్కొంది. భారత్‌లో ఉద్వేగాలు పెరిగే ప్రమాదాన్ని నివారించేందుకే చైనా మరణాల సంఖ్యను వెల్లడించలేదని వివరించింది. భారత జవాన్ల కంటే తక్కువ మందినే పోగొట్టుకున్న విషయాన్ని వెల్లడిస్తే ఆ దేశంలో భావోద్వేగాలు మరింత రగిలి సరిహద్దులో శాంతి నెలకొల్పే చర్యలను తీసుకోవడంలో భారత సర్కారుపై తీవ్ర ఒత్తిడి పెరిగేదని తెలిపింది. కాగా, భారత్, చైనా, రష్యాల విదేశాంగ శాఖల మంత్రులు మంగళవారం సమావేశం కానున్నారు. భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించేందుకు ఈ చర్చలో రష్యా చొరవతీసుకోబోతున్నట్టు కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు.

నిర్ణయాల అమలు

లడాఖ్‌లోని గాల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నప్పటికీ భారత్ తాను తీసుకున్న నిర్ణయాలను అమలు చేసుకుంటూ వెళ్తున్నది. భారత సార్వభౌమత్వ హక్కులోని ఏరియాలో గతంలో తలపెట్టిన నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. చైనాతో ఎల్ఏసీ సరిహద్దుకు సమీపంలో మౌలిక వసతుల నిర్మాణాలపై ఐదు రోజుల్లోనే రెండోసారి సమీక్షలు జరిపింది. ఎల్ఏసీకి ఆవల చైనా ఇప్పటికే అనేక నిర్మాణాలు, మౌలిక వసతుల నిర్మాణాలను చేపట్టింది. అయితే, అందుకు దీటుగా సరిహద్దుకు మనవైపున రవాణా కోసం రోడ్లు, ఎయిర్‌ఫీల్డుల నిర్మాణాలు చేపడుతుండటం చైనాకు కంటగింపుగా మారాయి. జూన్ 15నాటి ఘర్షణలకు ఈ నిర్మాణాలే కారణమని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. భారత్ ఇటీవలే గాల్వాన్ పర్వతాల్లో రక్షణ రంగానికి సహకరించే రోడ్డు(దర్బుక్ నుంచి దౌలత్ బేగ్ ఓల్డీ మార్గం)ను పూర్తి చేసింది.

ఆరేళ్లలో 4,764 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలు

లడాఖ్ అభివృద్ధి కోసం గాల్వాన్ లోయ, ష్యోక్ రివర్‌ల గుండా రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని భారత్ ఇప్పటికే నిర్ణయించుకుంది. రెండో దశ నిర్మాణంలో భాగంగా లడాఖ్ రీజియన్‌లో 2019 కల్లా 32 వ్యూహాత్మక మార్గాలను పూర్తి చేయాలని భారత్ తలచింది. కానీ, నిర్దేశించుకున్న సమయంలోపు నిర్మాణాలు జరక్కపోవడంతో తాజాగా, వాటి నిర్మాణాలను వేగవంతం చేయాలని భావిస్తున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. గత ఆరేళ్లలో 4,764 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్‌ల గుండా వెళ్లే రెండు రోడ్లను పూర్తి చేయాల్సి ఉన్నదని వివరించారు. వీటితోపాటు పలు రోడ్ల నిర్మాణాలకు ప్రణాళికలు వేసుకుంది. ఈ నిర్మాణాలకు కావల్సిన అధునాతన పరికరాలపైనా కేంద్రం సమీక్షించింది. 2017-2020ల మధ్య ఫాస్ట్ ట్రాక్‌ పద్ధతిని కేంద్రం అనుసరిస్తున్నది. బిల్డింగ్ మెటీరియల్‌ను తరలించేందుకు చినూక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను వినియోగిస్తున్నది.

‘చైనా ఆర్మీ వెనక్కి వెళ్లిపోవాలి’

హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న తర్వాత తొలిసారి ఇరుదేశాల కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో 16 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరిందర్ సింగ్, చైనాకు చెందిన సౌత్ జిన్‌జియాంగ్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ మేజర్ జనరల్ లియూ లిన్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశం చైనా వైపున చూషుల్ సమీపంలోని మోల్డోలో జరిగింది. ఉద్రిక్తతలు సమసిపోయేందుకు చైనా ఆర్మీ వెనక్కి వెళ్లాలని జూన్ 6నాటి సమావేశంలో భారత ఆర్మీ డిమాండ్ చేసింది. కానీ, చైనా ఈ డిమాండ్లను అంగీకరించినా ఆర్మీని మాత్రం వెనక్కి తీసుకోలేదు. ఇదే డిమాండ్‌పై ఉన్న భారత మిలిటరీ సోమవారం మరోసారి చర్చలు జరిపింది. ఈ సమావేశంలోనూ చైనా ఆర్మీ ఏప్రిల్‌లో ఎక్కడైతే ఉన్నారో అక్కడికే తరలాలని నొక్కి చెప్పినట్టు తెలిసింది. మే నెల నుంచి ఇరుదేశాల డివిజన్ కమాండర్ స్థాయి సమావేశాలు ఎనిమిది సార్లు జరిగిన సంగతి తెలిసిందే.

మోడీని చైనా ఎందుకు స్తుతిస్తున్నది: రాహుల్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సరిహద్దు విషయమై కేంద్రంపై మరోసారి ప్రశ్నలు కురిపించారు. లడాఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ప్రధాని మోడీని చైనా ఎందుకు ప్రశంసిస్తున్నదని ట్వీట్ చేశారు. చైనా మౌత్‌పీస్ గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన రిపోర్ట్‌ను ట్వీట్ చేస్తూ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా ప్రధాని మోడీని డ్రాగన్ దేశం ఎందుకు స్తుతిస్తున్నదని ప్రశ్నించారు. ‘చైనా మన జవాన్లను చంపేసింది. మన భూమిని లాక్కుంది. అటువంటి చైనా ఇప్పుడు ప్రధాని మోడీని ఎందుకు పొగుడుతున్నది’ అని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story