డిగ్రీ ఉందా! ఓటు వేస్కో.. నోటు తీస్కో!

by Anukaran |
డిగ్రీ ఉందా! ఓటు వేస్కో.. నోటు తీస్కో!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఒక్క ఓటుతో ప్రభుత్వాలే కూలిపోయాయి. ఎందరో నేతల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అందుకే ఒక్క ఓటే కదా అని చులకనగా చూడకూడదు. ఈ విషయాన్ని బాగా వంట బట్టించకున్న మన రాజకీయనేతలు ఆ ఒక్క ఓటు కోసం నానా తంటాలు పడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి ఒక్కో పార్టీ ఒక్కో ఎత్తుగడ వేస్తోంది. ఒక పార్టీ అయితే ఏకంగా అర్హులైన పట్టభద్రుల బ్యాంకు ఖాతాలను సేకరిస్తోంది. పోలింగ్ సమయానికి ఆ ఖాతాలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి కొంత డబ్బు డిపాజిట్ అవుతుంది. ఆన్‌లైన్ ద్వారా ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకోడానికి (ఫాం-18) ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ ఫిజికల్ ఫాంలో వివరాలను నింపి జాబితాలో పేరును నమోదు చేయించే బాధ్యత తీసుకుంది. అందుకు ప్రతిఫలంగా ఓటు వేయాలన్న షరతు విధిస్తోంది. ఇందుకు ఎంతో కొంత ముట్టజెప్తామని కూడా హామీ ఇస్తోంది.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాలు ఒక నియోజకవర్గంగా, వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాలు మరో నియోజకవర్గంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ జిల్లాల పరిధిలోని సర్పంచ్ మొదలు రాష్ట్ర స్థాయి నేత వరకు అర్హత కలిగిన పట్టభద్రులను గుర్తించి ప్రత్యేకంగా క్యాంపెయిన్ నిర్వహించి ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసే ప్రక్రియను పెట్టారు. అన్ని కళాశాలల్లో 2014-17 మధ్య కాలంలో డిగ్రీ పూర్తిచేసిన వారి వివరాలను రికార్డుల నుంచి సేకరిస్తున్నారు. ఆ ప్రకారం వారి ఇండ్లకు వెళ్ళి, ఫోన్‌లు చేసి పట్టుకుని ఓటర్ల జాబితాలో పేరును నమోదు చేసుకోవాల్సిందిగా వివరించి పై విధానాన్ని అమలుచేస్తున్నారు.

చదువుకున్న పట్టభద్రులు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి ఎన్నో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలను వాడుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా వారికి ఎన్నికల వెబ్‌సైట్‌కు వెళ్ళి పేర్లను నమోదు చేసుకునే విధానం తెలియందేమీ కాదు. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఆ వెబ్‌సైట్‌లో అనుకున్న సమయానికి నమోదు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరిగ్గా ఈ కారణాన్నే ఆ పార్టీ నేతలు ఉపయోగించుకుంటున్నారు. ‘మీరు ఇబ్బంది పడాల్సిన పనిలేదు.. అన్ని వివరాలనూ ఇస్తే మేమే మీ తరఫున ఫిజికల్ ఫాంను నింపి సమర్పిస్తాం. మీరు చేయాల్సిందల్లా మీ బ్యాంకు ఖాతా నెంబర్‌ను మాకు ఇవ్వండి.. ‘ అంటూ ఓటుకు నోటు ఇస్తామనే ప్లాన్ గురించి వివరిస్తున్నారు.

పట్టభద్రుల్లో కొంతమందికి ఇప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫ్రాధాన్యతా విధానంలో ఓటు ఎలా వేయాలో తెలియదు. అందుకే 2014లో జరిగిన ఎన్నికల సమయంలో వేల సంఖ్యలో ఓట్లు చెల్లనివి (ఇన్‌వ్యాలిడ్) అయిపోయాయి. ఇప్పుడు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే క్రమంలో కూడా డిగ్రీ/డిప్లొమా సర్టిఫికెట్లతో పాటు గెజిటెడ్ అధికారి ధృవీకరణ ఉండాలన్న నిబంధనను సరిగా అర్థం చేసుకోలేక అలాంటి అధికారి సంతకం లేకుండానే సమర్పిస్తున్నారు. దీంతో వారి పేర్లు జాబితాలో చేరకుండా మిగిలిపోతున్నాయి. ఇలాంటి అంశాలు కూడా ఆ పార్టీ సొమ్ము చేసుకుని అలాంటి శ్రమ లేకుండా అన్నీ తామే చూసుకుంటామని భరోసా కల్పించి ఫిజికల్ విధానానికి శ్రీకారం చుట్టింది.

ఎన్ని ఓట్లు పడతాయో లేవో తెలియదుగానీ డైరెక్టుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాయన్న సంతోషం వర్కవుట్ అవుతుందనేది ఆ పార్టీ ఉద్దేశం. ఎంత డబ్బులు వేస్తామన్నది ఇప్పుడు చెప్పట్లేదు గానీ కనీసం గులాబీ రంగు నోటు విలువకు తగ్గదనేది ఆ పార్టీ నేతల నుంచి లభిస్తున్న హామీ. ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకోడానికి గడువు ముగిసిన తర్వాత ఎన్ని ఆన్‌లైన్ విధానంలో దాఖలయ్యాయి, ఎన్ని ఫిజికల్ రూపంలో దాఖలయ్యాయో లెక్క తేలుతుంది. దాన్ని బట్టి ఆ పార్టీలో గెలుపుపై ఒక మేరకు ధీమా ఏర్పడుతుంది.

Advertisement

Next Story

Most Viewed