కరోనా టైంలో జోరుగా కార్ల అమ్మకాలు

by Anukaran |
కరోనా టైంలో జోరుగా కార్ల అమ్మకాలు
X

ప్రజల్లో కరోనా ఫీవర్​ పోలేదు. రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్యను చూసి కంగారు పడుతున్నారు. గడపదాటాలంటేనే గజగజ వణుకుతున్నారు. ప్రయాణాలన్నీ వాయిదా వేసుకుంటున్నారు. అత్యవసరమైతేనే, అది కూడా కార్లలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు మధ్యతరగతి కుటుంబాల్లో కనిపించని కార్లు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. సొంతగా సెకండ్​హ్యాండ్​ కారు కొనుగోలు చేసి కుటుంబంతో సహా ప్రయాణిస్తున్నారు. దీంతో నగరంలో సెకండ్​హ్యాండ్​ కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఎక్కువ ధర ఉన్న కార్ల జోలికి వెళ్లకుండా రూ.లక్షనుంచి రూ.5లక్షల వరకు గల కార్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రజారవాణా వ్యవస్థ ఉన్న ప్రజల్లో నమ్మకం కలగడం లేదు. ఇక బైక్ పై ప్రయాణం ప్రమాదమే.. దీంతో అందరి చూపు ఇప్పుడు సెకండ్​ హ్యాండ్​ కార్లపై పడింది. లాక్​డౌన్​ నేపథ్యంలో జూన్​, జూలై నెలలో నగరంలో సుమారు 45వేల కార్ల అమ్మకాలు జరిగాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. మూడేళ్లలో జరిగే సేల్స్​ కరోనా పుణ్యమాని రెండు నెలల్లోనే జరిగాయి. పట్టణవాసులే కాకుండా గ్రామీణ ప్రజలు సైతం సెకండ్​ హ్యాండ్​ కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. సేఫ్టీ మరియు సౌకర్యంగా ఉండడంతో కష్టకాలంలోనూ కాసులు విదల్చక తప్పడం లేదు. మొత్తంగా కరోనా కాలంలో అన్ని రంగాలు కుదేలైనా సెకండ్​ హ్యాండ్​ కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

‌‌
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో గడప దాటాలంటేనే జంకుతున్నారు. వైరస్​ మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందోనని భయం నెలకొంది. ప్రయాణాలు చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. ప్రజా రవాణా వ్యవస్థ పాక్షికంగా మొదలైనా ప్రయాణికుల్లో భయం వీడలేదు. ఆటోలు, క్యాబ్ లు అందుబాటులో ఉన్నా ఎక్కేందుకు ధైర్యం చేయడం లేదు. బైక్​ల మీద ప్రయాణాన్ని కూడా వాయిదా వేస్తున్నారు. రోడ్డు మీదకి ఎలాంటి వ్యక్తి వస్తాడో.. పక్కనుంచి పయనిస్తే.. కరోనా సోకిన వ్యక్తి శ్వాస, తుంపర్లు ఎక్కడ తనపై పడుతాయోనన్న అనుమానం పెనుభూతంగా మారుతోంది. ముఖ్యంగా మధ్య తరగతి వర్గాలు రోడ్డుపై ప్రయాణం చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. పైగా ఇప్పట్లో ప్రజా రవాణా వ్యవస్థ గాడిన పడేటట్లు లేదు. ఆ ప్రయాణం ఎంత వరకు సురక్షితమన్న దానికి సమాధానం లేదు. సేఫ్టీ జర్నీ కోసం కారు తప్పనిసరి అన్న అభిప్రాయానికి మధ్య తరగతి వర్గాలు వచ్చాయి. ప్రయాణాలు అనివార్యం. ఎంత కాలం ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉండగలం. ఊర్లో ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు, అక్కడి వ్యవసాయం, ఇతర వ్యవహారాలను చక్కదిద్దుకోవడానికి ప్రయాణం తప్పనిసరి. ఈ క్రమంలో సొంత కారు ఉండడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. కానీ సెకండ్ సేల్ కార్లకు మాత్రం గిరాకీ పెరిగింది. లాక్ డౌన్ కాలం మినహాయిస్తే జూన్, జూలై నెలల్లోనే ఏకంగా 45 వేల కార్ల అమ్మకాలు సాగినట్లు అంచనా. దీంతో సగటున లెక్క తీస్తే రూ.1,125 కోట్ల లావాదేవీలు సాగినట్లు తెలుస్తోంది. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు మాత్రమే. మూడేండ్లలో ఎంత అమ్మకాలు ఉంటాయో ఆ స్థాయిలో గడిచిన ఈ రెండు నెలల్లోనే పూర్తైనట్లు సెకండ్ కార్ సేల్స్ ఎజెన్సీలు చెబుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చాలా వ్యాపారాలు జీరోకు పడిపోయాయి. కొన్నేమో పాక్షికంగా నడుస్తున్నాయి. ఐతే సెకండ్ కార్ సేల్స్ మాత్రం మరింతగా పుంజుకోవడం గమనార్హం. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోనే 3 వేల మంది సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే ఎజెంట్లు ఉన్నారు.

చిన్న కార్లపైనే మోజు

ఇప్పటి దాకా బైక్​పై ప్రయాణించే వారికే కొత్తగా కారు యజమాని కావాలన్న ఆతృత కనబరుస్తున్నారు. ఇదంతా వైరస్ నుంచి స్వీయ రక్షణ కోసమే.. అందుకే చిన్న కార్లపైనే మొగ్గు చూపుతున్నారు. ఈ రెండు నెలల్లో విక్రయించిన కార్ల ధరలు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు మాత్రమే ఉన్నాయి. అంతకు మించిన ధర పలికే కార్ల జోలికి వెళ్లడంలేదని ఏజెంట్లు చెబుతున్నారు. నలుగురు కూర్చోవడానికి వీలైన వాహనమైతే చాలని, ఫీచర్లు, ఇతర సదుపాయాల జోలికి వెళ్లడంలేదు. మారుతి, టయోటా వంటి వాటిల్లో తక్కువ ధరకు వచ్చే వాటిపైనే ఫోకస్ పెట్టారు. ఎక్కువ ధర పలికే కార్ల అమ్మకాలు సాగడం లేదు. హైదరాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, విజయవాడ, గుంటూరు, వైజాగ్, కర్నూలు, నెల్లూరు, కాకినాడ, విజయనగరం వంటి పట్టణాలకు ప్రతి రోజూ బస్సులు నడిచేవి. రాత్రి బయలుదేరితే ఉదయంకల్లా వారి పట్టణాల్లో ఉండేవాళ్లు. ఇప్పుడేమో నలుగురితో కలిసి ప్రయాణాన్ని తిరస్కరిస్తున్నారు. అందుకే తమ కుటుంబం కష్టంగానైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయాలనుకుంటున్నారు.

నగదు చెల్లింపులే అధికం

చాలా కాలంగా పొదుపు చేసుకున్న సొమ్మును ఇప్పుడు కార్ల కొనుగోలుకు ఖర్చు చేస్తున్నారు. అందుకే మెజార్టీ కార్ల అమ్మకాలు నగదు చెల్లింపులతో జరిగినట్లు తెలుస్తోంది. రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు క్యాష్ ఇచ్చి కార్లను తీసుకెళ్లిన వారే అధికం. ఆ పైన విలువజేసే కార్ల కొనుగోలుకు మాత్రం బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటున్నారు. అది కూడా తక్కువ ఈఎంఐలతోనే చెల్లించే వ్యూహంతో ఉన్నారు. ఎక్కువగా నెల జీతంతో పని చేసే మధ్య తరగతి వర్గాలే సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తున్నాయి. కొనుగోలుదారుల్లో గ్రామీణ ప్రాంతానికి చెందిన వారే ఎక్కువగా ఉండడం గమనార్హం. 3 వేల సెకండ్ కార్ల సేల్స్ ఆఫీసుల్లో నెలకు 15 అమ్మకాలు సాగించాయన్న సగటు లెక్క తీసినా 45 వేల కార్లు విక్రయించినట్లే. దాన్ని బట్టి సుమారు రూ.1,125 కోట్ల లావాదేవీలు సాగినట్లు అంచనా. ఇక కొత్త కార్లను పరిగణనలోకి తీసుకోలేదు.

ప్రజా రవాణ పట్ల విముఖత: కృష్ణయాదవ్, ఎవర్ కార్స్ యజమాని

గతంలో ఎప్పుడూ ఈ తరహాలో అమ్మకాలు చూడలేదు. ఈ రెండు నెలల్లో సేల్స్ చాలా పెరిగాయి. సగటున రోజుకొకటి విక్రయించాం. చిన్న కార్లు మాత్రమే అడుగుతున్నారు. మా దగ్గరికి హైదరాబాద్ కు చెందిన వాళ్లు 20 శాతం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు 80 శాతం వస్తున్నారు. రూ.10 లక్షల లోపు ఉన్న కార్లను మాత్రమే అడుగుతున్నారు. ఆ పైన ఉన్న కార్లను ఎవరూ చూడడం లేదు. చిన్న కారయినా సరే.. సొంతంగా ప్రయాణం చేయాలనుకుంటున్నారు.నగరంలో 3 వేలకు పైగానే సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే ఆఫీసులు ఉన్నాయి. అన్నింట్లోనూ సేల్స్ బాగా సాగుతున్నాయి.

క్యాష్ పేమెంట్ కే మొగ్గు: శ్రీశైల్, ఆటోమొబైల్ ఇంజినీర్, ఆటో ఇంజినీర్ కార్స్

ఊహించని రీతిలో కార్ల అమ్మకం పెరిగింది. మేం ఆఫీసు పెట్టిన మూడేండ్లల్లో ఇలాంటి సేల్స్ చూడలేదు. అందరూ క్యాష్ పేమెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. చిన్న ఎమౌంట్ కోసం మళ్లీ లోన్ తీసుకోవడమన్న ఫీలింగ్ లో ఉన్నారు. జూలైలోనే 30 కార్ల వరకు అమ్మగలిగాం. కరోనాతో ప్రజా రవాణా వ్యవస్థను ఇష్టపడడం లేదని అర్ధమవుతోంది.

కార్లు లేవు: పవన్ కుమార్, ఫస్ట్ చాయిస్ కార్స్ యజమాని

కార్లు అయిపోయాయి. ఇప్పుడు ఎవరి దగ్గరా కార్లు లేవు. చిన్న కార్లను అడుగుతున్నారు. ఆ కార్ల పర్చేజింగ్ ఆగిపోయింది. ఇక అమ్మకాలు నిలిచిపోయాయి. ఊహించని రీతిలో చిన్న కార్లు అమ్మాం. ప్రధానంగా రూ.50 వేల నుంచి రూ.3 లక్షల విలువైన కార్లను కొనుగోలు చేస్తున్నారు. జూన్ లో 17, జూలై 25 వరకు అమ్మాం. కార్లు ఉంటే ఇంకా అమ్మేటోళ్లం. మధ్య తరగతి వర్గాలే కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed