ఏప్రిల్ తర్వాత 5 శాతం పెరగనున్న కమర్షియల్ వాహనాల ధరలు!

by Vinod kumar |
ఏప్రిల్ తర్వాత 5 శాతం పెరగనున్న కమర్షియల్ వాహనాల ధరలు!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత తమ అన్ని మోడళ్ల ధరలు 5 శాతం వరకు పెరుగుతాయని వీఈ కమర్షియల్ వెహికల్స్(వీఈసీవీ) వెల్లడించింది. వోల్వో గ్రూప్, ఐషర్ మోటార్స్ జాయింట్ వెంచర్ అయిన వీఈసీవీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఉద్గార నిబంధనలు అమల్లోకి వస్తాయని, అందుకనుగుణంగా వాహనాల తయారీ మార్పులు చేయనున్నామని తెలిపింది. దానివల్ల వాహనాల ధరల్లో మార్పులు ఉన్నాయి. గతంలో అమలైన బీఎస్4, బీఎస్6 ఉద్గార నిబంధనల తరహాలో కాకుండా కొత్త ఉద్గార నిబంధనలు భిన్నంగా ఉంటాయి. రియల్‌ డ్రైవింగ్‌ ఎమిషన్‌ (ఆర్‌డీఈ) పేరుతో జరిగే ఈ మార్పును బీఎస్‌-6 రెండో దశ ఉద్గార ప్రమాణాలు అంటారు.

దాని ప్రకారం.. పాసింజర్‌ వాహనాలు, కమర్షియల్ వాహనాల్లో ఎప్పటికప్పుడు వాహన ఉద్గార స్థాయులను కొలిచే విధానం ఉండాలి. ఈ మార్పుల కోసం కంపెనీలకు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. కాబట్టి వాహనాల ధరలను కూడా పెంచక తప్పదని కంపెనీ వివరించింది. వీఈసీవీ జాయింట్ వెంచర్ కంపెనీ లైట్, మీడియం, హెవీ డ్యూటీ విభాగాల్లో 12-72 సీటింగ్ కెపాసిటీ కలిగిన బస్సులను ఎక్కువగా విక్రయిస్తోంది. ఈ క్రమంలోనే అన్ని కమర్షియల్ వాహనాల ధరల్లోనూ ఇదే స్థాయి పెంపు జరగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed