- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BPCL: అమెరికా ఆంక్షలతో భారత్‌కు వచ్చే రష్యా చమురు సరఫరాలో ఇబ్బందులు

దిశ, బిజినెస్ బ్యూరో: రష్యా చమురుపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం మనదేశంపైనా ఉండనుంది. ఈ ఏడాది మార్చికి సరిపడా సరఫరా అందుబాటులో లేదని ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసెల్) తెలిపింది. మరో నెలన్నర తరువాత చమురు సరఫరా తగ్గనుందని సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నెల రెండోవారంలో రష్యా చమురు ఉత్పత్తిదారులైన గ్రాజ్‌ప్రోమ్ నెఫ్ట్, సర్టునెఫ్ట్ గ్యాస్‌లతో పాటు చమురు సరఫరా చేసే 183 నౌకలపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా ఆదాయాన్ని దెబ్బతీసేందుకు 2022లో జీ7 దేశాలు రష్యా చమురు ఎగుమతులపై బ్యారెల్‌కు 60 డాలర్ల పరిమితిని విధించాయి. దీనర్థం, దానికి మించిన ధరతో చమురును రష్యా సరఫరా చేసే వీలుండదు. ఈ సమస్యను అధిగమించేందుకు రష్యా సొంత కంపెనీలతో చమురు సరఫరా మొదలుపెట్టింది. ఇపుడు ఆ నౌకలపైన కూడా అమెరికా ఆంక్షలు విధించింది. రష్యాతో భారత్‌కు ఉన్న చమురు కొనుగోలు ఒప్పందం ప్రకారం, ప్రస్తుత కాంట్రాక్టుల గడువు మార్చి 12 వరకు ఉంది. భారతీయ రిఫైనర్లు మార్చి కార్గోల కోసం చర్చలు ప్రారంభించిన సమయంలో ఆంక్షలకు సంబంధించి ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో మార్చి చమురు సరఫరాకు తగినన్ని కార్గోలు లేవని బీపీసీల్ డైరెక్టర్(ఫైనాన్స్) రామకృష్ణ గుప్తా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీపీసీఎల్ శుద్ధి చేసిన మొత్తం చమురులో రష్యన్ చమురు 34-35 శాతంగా ఉంది. రష్యా చమురు సరఫరా ఆలస్యమైతే మార్కెట్లో తగినంత చమురు అందుబాటులో ఉంటుంది. రష్యా నుంచి తగ్గిన చమురును భర్తీ చేసేందుకు మిడిల్-ఈస్ట్ నుంచి తెచ్చుకునేలా ప్రత్యామ్నాయాలను చూస్తున్నట్టు రామకృష్ణ వివరించారు. అయితే, రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న తక్కువ ధరకు చమురు మనకు లభించదు.