Tesla-Tata: టెస్లా గ్లోబల్ సరఫరాదారులుగా టాటా కంపెనీలు

by S Gopi |
Tesla-Tata: టెస్లా గ్లోబల్ సరఫరాదారులుగా టాటా కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిచ్ వాహనాల(ఈవీ) కంపెనీ టెస్లాకు గ్లోబల్ సప్లయర్‌గా టాటా గ్రూప్ అవతరించనుంది. ఎందుకంటే టెస్లా కార్ల తయారీలో అవసరమైన విడిభాగాలు, ఇతర సేవలు సహా సరఫరా వ్యవస్థలో టాటాకు చెందిన టాటా ఆటోకాంప్, టీసీఎస్, టాటా టెక్నాలజీస్, టాటా ఎలక్ట్రానిక్స్ సహా పలు టాటా కంపెనీలు టెస్లా సరఫరా గొలుసులో భాగమయ్యాయి. ఈ కంపెనీలు టెస్లాకు అవసరమైన కీలకమైన విడిభాగాలు, సేవలను అందిస్తున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీలు టెస్లాతో గ్లోబల్ ఒప్పందాలను కుదుర్చుకున్నాయని, విడిభాగాలు, సేవలందిస్తున్నాయని ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. భవిష్యత్తులో టెస్లా భారత్‌లోనే తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో టాటా ప్రాధాన్యత మరింత పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో టెస్లా సీనియర్ ప్రొక్యూర్‌మెంట్ అధికారులు కొన్ని విడిభాగాల కోసం దేశీయ సరఫరాదారులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. వీటిలో కాస్టింగ్, ఫోర్జింగ్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాబ్రికేషన్ వంటి విడిభాగాలున్నాయి.

గత కొంతకాలంగా టెస్లా భారత సరఫరా కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా కొవిడ్-19 మహమ్మారి తర్వాత చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్న టెస్లాకు భారత్ మెరుగైన ప్రత్యామ్నాయంగా ఉంది. గతేడాది టెస్లాకు మన కంపెనీలు 2 బిలియన్ డాలర్ల(రూ. 17.20 వేల కోట్ల) విలువైన విడిభాగాలను సరఫరా చేశాయి. ఇప్పుడు టెస్లా తన సరఫరాను విస్తరించాలని చూస్తున్న తరుణంలో భారతీయ కంపెనీలకు అవకాశాలు, ప్రయోజనాలు పెరగనున్నాయి.

ప్రస్తుతానికి భారత్‌లో టెస్లా తయారీ యూనిట్ ఏర్పాటుపై స్పష్టత లేనప్పటికీ, ప్రభుత్వం నుంచి లభించే ప్రోత్సాహకాలు, పన్ను ప్రయోజనాలు, సుంకం మినహాయింపు ఆధారంగా దీనిపై త్వరలో వివరాలు వెల్లడి కానున్నాయి. దీనివల్ల ఇప్పటికిప్పుడు భారత సరఫరాదారుల విషయంలో బహిర్గతం కాని స్థాయిలో ఒప్పందాలను కలిగి ఉంది. తయారీ కేంద్రం ఏర్పాటు ఖరారైతే ఆయా కంపెనీల వివరాలు బయటకు రానున్నాయి. ప్రస్తుతం టాటా యాజమాన్యంలోని కంపెనీలు టెస్లా ఈవీల కోసం ఇంజనీరింగ్ ఉత్పత్తులను, ఎండ్-టు-ఎండ్ ప్రోడక్ట్ లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్, సర్క్యూట్ బోర్డ్ టెక్నాలజీ అందిస్తున్నాయి. టాటా అధికారికంగా సెమీకండక్టర్ చిప్‌లను విడుదల చేశాక వాటితో పాటు టెస్లా బ్యాటరీ నిర్వహణ, మోటార్ కంట్రోలర్ యూనిట్లు, డోర్ కంట్రోల్ మెకానిజమ్‌లకు కావాల్సిన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ(పీసీబీఏ)లను అందించనుంది. వచ్చే ఏడాది నాటికి చైనా, తైవాన్ వెలుపల కొన్ని విడిభాగాల ఉత్పత్తిని మరొక చోటుకు మార్చాలని టెస్లా తన సరఫరాదారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed