వారమంతా నష్టాల్లోనే మార్కెట్లు!

by Harish |
వారమంతా నష్టాల్లోనే మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారమంతా నష్టాలను మూటగట్టుకున్నాయి. గత వారాంతం 60 వేల మైలురాయి వద్ద ఉన్న సూచీలు వరుస ఆరు సెషన్లలో పతనం కావడం మూలంగా 1,500 పాయింట్లకు పైగా నష్టపోయింది. శుక్రవారం ట్రేడింగ్‌లో సైతం సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, కీలకమైన రంగాల్లో మదుపర్లు అమ్మకాలకు సిద్ధపడటంతో క్షీణించాయి.

మరోవైపు అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం సైతం కొనసాగడంతో వాటి ప్రభావం స్టాక్ మార్కెట్లపై కొనసాగుతోంది. వీటితో పాటు ఆసియా మార్కెట్లలో బలహీన ట్రేడింగ్ ధోరణి, ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే ఆందోళనలతో పాటు దేశీయంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లలో విదేశీ నిధులు, అమ్మకాల ఒత్తిడి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 141.87 పాయింట్లు నష్టపోయి 59,463 వద్ద, నిఫ్టీ 45.45 పాయింట్లు కోల్పోయి 17,465 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా రంగం మాత్రమే రాణించగా, మెటల్ ఏకంగా 3 శాతానికి పైగా బలహీనపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.

ఎంఅండ్ఎం, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎల్అండ్‌టీ, మారుతీ సుజుకి, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.73 వద్ద ఉంది. గత వారాంతం నుంచి స్టాక్ మార్కెట్లలో మొదలైన నష్టాల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు ఆరు సెషన్లలో 3 శాతం చొప్పున కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్ 1,540 పాయింట్ల వరకు క్షీణించడంతో, మదుపర్ల సంపద రూ. 8 లక్షల కోట్ల మేర క్షీణించి రూ. 260 లక్షల కోట్లకు పరిమితమైంది.

Advertisement

Next Story

Most Viewed