S&P: బంగ్లాదేశ్ సంక్షోభంతో భారత వాణిజ్యంపై ప్రభావం.. S&P రేటింగ్స్‌ కీలక ప్రకటన

by Harish |
S&P: బంగ్లాదేశ్ సంక్షోభంతో భారత వాణిజ్యంపై ప్రభావం.. S&P రేటింగ్స్‌ కీలక ప్రకటన
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో ఏర్పడినటువంటి సంక్షోభం భారత వాణిజ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్న తరుణంలో ప్రముఖ గ్లోబల్‌ రేటింగ్స్‌ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ తాజాగా స్పందించింది. దక్షిణాసియాలో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాన ఎగుమతిదారు అయినప్పటికి కూడా ఈ సంక్షోభం కారణంగా భారతదేశ మొత్తం వాణిజ్యంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం లేదని ఎస్‌అండ్‌పీ మంగళవారం తెలిపింది. ఇప్పుడు ఏర్పడిన అనిశ్చితి కారణంగా రెండు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు కొంత వరకు ప్రభావితం అవుతాయి. అంతే కానీ భారత్‌కు వచ్చిన ప్రమాదం ఏం లేదని ఏజెన్సీ పేర్కొంది.

బంగ్లాదేశ్‌కు భారతదేశం నుంచి ఎగుమతులు 2022-23లో $12.21 బిలియన్ల నుండి 2023-24లో $11 బిలియన్లకు తగ్గాయి. దిగుమతులు కూడా 2022-23లో $2 బిలియన్ల నుండి గత ఆర్థిక సంవత్సరంలో $1.84 బిలియన్లకు తగ్గాయి. భారత్ నుంచి ఆ దేశానికి ప్రధానంగా కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు, చక్కెర, మిఠాయిలు, శుద్ధి చేసిన పెట్రోలియం నూనె, రసాయనాలు, పత్తి, ఇనుము, ఉక్కు, వాహనాలను ఎగుమతి అవుతాయి. అదే అక్కడి నుంచి భారత్‌కు చేపలు, ప్లాస్టిక్, తోలు, దుస్తులు మొదలైనవి దిగుమతి అవుతున్నాయి.

ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్, సావరిన్ అండ్ ఇంటర్నేషనల్ పబ్లిక్ ఫైనాన్స్ రేటింగ్స్ (ఆసియా-పసిఫిక్) డైరెక్టర్ ఆండ్రూ వుడ్ మాట్లాడుతూ, ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ దేశీయ డిమాండ్ పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. అందుకే పరిస్థితులు సద్దుమణిగే వరకు ఇతర దేశాల నుంచి బంగ్లాదేశ్‌‌కు వచ్చే దిగుమతులకు తక్కువ మద్దతు ఉంటుందని అన్నారు. భారత్ మొత్తం ప్రపంచానికి వైవిధ్యభరితమైన ఎగుమతిదారుగా ఉంది. ఇది బంగ్లాదేశ్ వంటి ఆర్థిక వ్యవస్థలతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల కంటే ఎక్కువ వాణిజ్యాన్ని కలిగి ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ సంక్షోభంతో వాణిజ్య పరంగా భారత్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని ఆండ్రూ వుడ్ అన్నారు.

Advertisement

Next Story