వరుసగా నాలుగో రోజు పుంజుకున్న స్టాక్ మార్కెట్లు!

by Harish |   ( Updated:2023-04-27 15:46:47.0  )
వరుసగా నాలుగో రోజు పుంజుకున్న స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు కొనసాగుతున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో విదేశీ పెట్టుబడులు సానుకూలంగా మారడం, నెలవారీ డెరివేటివ్స్ సందర్భంగా మదుపర్లు దిగ్గజ కంపెనీల షేర్లను కొనేందుకు ఆసక్తి చూపించడం వంటి అంశాలు వరుసగా నాలుగో రోజు లాభాలకు కారణమయ్యాయి. ఉదయం ఊగిసలాట మధ్య ప్రారంభమైనప్పటికీ సూచీలు మిడ్-సెషన్ తర్వాత పుంజుకున్నాయి. పై కారణాలతో పాటు మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లలో కొనుగోళ్ల సెంటిమెంట్ పెరిగింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 348.80 పాయింట్లు ఎగసి 60,649 వద్ద, నిఫ్టీ 101.45 పాయింట్లు లాభపడి 17,915 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ రంగం మాత్రమే స్వల్పంగా నీరసించింది. రియల్టీ, ఐటీ, బ్యాంకింగ్ రంగాలు రాణించాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, ఎల్అండ్‌టీ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. హిందూస్తాన్ యూనిలీవర్, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్, విప్రో స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.84 వద్ద ఉంది.

Advertisement

Next Story