Stock Market: వారాంతం నష్టాలను ఎదుర్కొన్న సూచీలు

by S Gopi |
Stock Market: వారాంతం నష్టాలను ఎదుర్కొన్న సూచీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం నష్టాలను ఎదుర్కొన్నాయి. రికార్డు గరిష్ఠాలు, అంతర్జాతీయ పరిణామాలతో ఈ వారం మొత్తం సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో గ్లోబల్ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడంతో పాటు సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలు అంచనాలకు తగినట్టుగా లేకపోవడం, కీలక బ్యాంకింగ్, ఐటీ దిగ్గజం టీసీఎస్ షేర్లలో బలహీనత కారణంగా స్టాక్ మార్కెట్లు బలహీనపడ్డాయి. వీటికి తోడు ఈ వారంలో మదుపర్లను ప్రభావితం చేసే కీలక సంఘటనలు లేకపోవడం, అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాలు నష్టాలకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 230.05 పాయింట్లు నష్టపోయి 81,381 వద్ద, నిఫ్టీ 34.20 పాయింట్లు నష్టపోయి 24,964 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఫార్మా, ఐటీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, హిందూస్తాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, టైటాన్, సన్‌ఫార్మా షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఎంఅండ్ఎం, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకి, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 84.06 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed