మళ్లీ నష్టాల్లో సూచీలు!

by Harish |
మళ్లీ నష్టాల్లో సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ నష్టాలు నమోదయ్యాయి. వరుస తొమ్మిది రోజుల పాటు లాభాలు సాధించిన తర్వాత ఈ వారం ప్రారంభం పతనమైన సూచీలు, మంగళవారం ట్రేడింగ్‌లోనూ నష్టాలను కొనసాగించాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, విద్యుత్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా స్టాక్ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇదే సమయంలో మెటల్, రియల్టీ షేర్లలో కొనుగోళ్లతో నష్టాలు కొంతవరకే పరిమితమయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటంతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 183.74 పాయింట్లు నష్టపోయి 59,727 వద్ద, నిఫ్టీ 46.70 పాయింట్లు పడిపోయి 17,660 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, రియల్టీ, హెల్త్‌కేర్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, సన్‌ఫార్మా, మారుతీ సుజుకి కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. పవర్‌గ్రిడ్, అల్ట్రా సిమెంట్, రిలయన్స్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.03 వద్ద ఉంది.

Advertisement

Next Story