ఆర్‌బీఐ జోష్‌తో లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

by Disha Desk |
ఆర్‌బీఐ జోష్‌తో లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు జోరుగా ర్యాలీ అవుతున్నాయి. గత రెండు సెషన్లలోమెరుగైన ట్రేడింగ్ తర్వాత గురువారం ఆర్‌బీఐ ఇచ్చిన కీలక మద్దతుతో మరోసారి భారీగా లాభాల్లో స్టాక్ మార్కెట్లు కదలాడాయి. ఆర్‌బీఐ వరుసగా పదోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో మదుపర్లు ఉత్సాహంగా కొనుగోళ్లను నిర్వహించారు. గురువారం ఉదయం స్థిరంగా ప్రారంభమైన ట్రేడింగ్ ఆర్‌బీఐ ప్రకటన వెలువడే వరకు ఊగిసలాట ధోరణిలో కనిపించింది. అనంతరం ఒక్కసారిగా దూకుడు పెంచిన సూచీలు ఓ దశలో 59 వేల కీలక మైలురాయిని దాటినప్పటికీ చివరికి స్థిరమైన లాభాలతో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ రంగాలు రాణించడంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 460.06 పాయింట్లు పుంజుకుని 58,926 వద్ద, నిఫ్టీ 142.05 పాయింట్లు పెరిగి 17,605 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, పీఎస్‌యూ బ్యాంకింగ్ ఇండెక్స్‌లు స్వల్పంగా నీరసించగా, ఫైనాన్స్, మీడియా, మెటల్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, ఆల్ట్రా సిమెంట్, నెస్లె ఇండియా, రిలయన్స్ కంపెనీల షేర్లు మాత్రమే క్షీణించాయి. మిగిలిన అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా టాటా స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంక్, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ షేర్లు 1-2 శాతం వరకు లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.96 వద్ద ఉంది.

Advertisement

Next Story