Stock Market: రికార్డు గరిష్ఠాలు తాకి నీరసించిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
Stock Market: రికార్డు గరిష్ఠాలు తాకి నీరసించిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మరోసారి రికార్డు స్థాయి ర్యాలీ జరిగింది. కీలకమైన ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతు, విదేశీ ఇన్వెస్టర్లు సైతం మన మార్కెట్లలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉండటం వంటి పరిణామాలతో సోమవారం ట్రేడింగ్‌లో సూచీలు ఆల్‌టైమ్ హై స్థాయిలను తాకాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 81,908 వద్ద రికార్డు గరిష్ఠాలను తాకాయి. మిడ్-సెషన్ సమయం వరకు దూకుడుగా వెళ్లిన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత క్రమంగా బలహీనబడ్డాయి. గరిష్ఠాల వద్ద పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడం వల్ల లాభాలు తగ్గాయి. దీంతో మార్కెట్లు ముగిసె సమయానికి సెన్సెక్స్ 23.12 పాయింట్లు లాభపడి 81,355 వద్ద, నిఫ్టీ అత్యల్పంగా 1.25 పాయింట్ల లాభంతో 24,836 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, మీడియా, ఆటో రంగాలు పుంజుకున్నాయి. ఉదయం మార్కెట్లకు మద్దతుగా ఎగసిన ఐటీ రంగం షేర్లు అనంతరం బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఆల్ట్రా సిమెంట్, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.73 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed