SEBI: ఎస్ఎంఈ ఐపీఓ నిబంధనలను కఠినతరం చేసిన సెబీ

by S Gopi |
SEBI: ఎస్ఎంఈ ఐపీఓ నిబంధనలను కఠినతరం చేసిన సెబీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) స్మాల్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్(ఎస్ఎంఈల) ఐపీఓలకు సంబంధించి నిబంధనలను కఠినతరం చేసింది. ప్రధానంగా లాభాలు, ఆఫర్ ఫర్ సేల్‌లపై పరిమితి విధించింది. రిటైల్ పెట్టుబడిదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, గత కొన్నాళ్లుగా ఎస్ఎంఈ ఐపీఓల్లో రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో నిబంధనల అవసరాన్ని సెబీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీని ప్రకారం, ఎస్ఎంసీ విభాగం నుంచి ఐపీఓకు వచ్చే ఏ కంపెనీ అయినా గడిచిన మూడేళ్ల కాలంలో కనీసం రెండు సంవత్సరాలైనా రూ. కోటి నిర్వహణ లాభాలను కలిగి ఉండాలి. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా షేర్ హోల్డర్లు తమ వాటాలో 20 శాతానికి మించి విక్రయించడానికి అవకాశం ఉండదు. అలాగే, ప్రస్తుతం వాటా ఉన్న వారెవ్వరూ 50 శాతానికి మించి వాటాను విక్రయించకూడదు. కనీస వాటా పరిమితి కంటే ఎక్కువగా ఉన్న షేర్ హోల్డింగ్‌కు లాక్-ఇన్ వ్యవధి అమలవుతుంది. అదనంగా ఉన్న వాటాను ఏడాది తర్వాత, రెండేళ్ల తర్వాత మిగిలిన 50 శాతం వాటాను విక్రయించే అవకాశం లభిస్తుంది. ఎస్ఎంఈ ఐపీఓలో పాల్గొనే వారు కనీసం రెండు లాట్‌లు కొనాల్సి ఉంటుంది. ఐపీఓ నుంచి సేకరించిన నిధుల్లో 15 శాతం లేదా రూ. 10 కోట్ల వరకే కార్పొరేట్ అవసరాలకు వాడుకోవచ్చు. ప్రమోటర్లతో పాటు ప్రమోటర్ గ్రూపులు, సంబంధిత పార్టీలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తీసుకున్న రుణాలు చెల్లించేందుకు ఐపీఓ నిధులను వాడకూడదు.

Next Story

Most Viewed