రిలయన్స్ సొంతం కానున్న పారామౌంట్ భారత టీవీ వ్యాపారం

by S Gopi |
రిలయన్స్ సొంతం కానున్న పారామౌంట్ భారత టీవీ వ్యాపారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత టీవీ వ్యాపారంలో తమ వాటాలను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయిస్తామని అమెరికాకు చెందిన పారామౌంట్ గ్లోబల్ గురువారం ప్రకటనలో వెల్లడించింది. వయాకామ్ 18 మీడియాలో పారామౌంట్ గ్లోబల్‌కు 13.1 శాతం వాటాను రిలయన్స్‌కు విక్రయించడానికి ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపింది. దీని విలువ రూ. 4,286 కోట్లు. ఈ ఒప్పందానికి నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. అదేవిధంగా షరతులు కూడా ఉంటాయని తెలుస్తోంది. అందుకు ఇరు సంస్థలు ఒప్పుకుంటే కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని పారామౌంట్ గ్లోబల్ పేర్కొంది. అంతేకాకుండా ఇటీవల కుదిరిన రిలయన్స్, స్టార్ డిస్నీ, వయాకామ్ 18 జాయింట్ వెంచర్ ఏర్పాటు పూర్తయిన తర్వాతే ఈ కొనుగోలు అమలవుతుందని స్పష్టం చేసింది. కొనుగోలు ప్రక్రియ అనంతరం పారామౌంట్‌కు చెందిన కంటెంట్ వయాకామ్ 18కి అందనుంది. ఇక, ఈ కొనుగోలు ద్వారా వయాకామ్‌లో రిలయన్స్ వాటా 70.49 శాతానికి చేరనుంది. ఇటీవల భారత వ్యాపార కార్యకలాపాలను విలీనం కోసం రిలయన్స్, వాల్ట్ డిస్నీ మధ్య ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ జాయింట్ 120 టీవీ ఛానెళ్లు, 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, 75 కోట్ల వీక్షకులతో భారత మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోనే అతిపెద్ద సంస్థగా నిలవనుంది.

Advertisement

Next Story

Most Viewed