ఫ్యూచర్ రిటైల్ కొనుగోలు రేసు నుంచి తప్పుకున్న రిలయన్స్, అదానీ కంపెనీలు!

by Prasanna |   ( Updated:2023-05-17 08:51:03.0  )
ఫ్యూచర్ రిటైల్ కొనుగోలు రేసు నుంచి తప్పుకున్న రిలయన్స్, అదానీ కంపెనీలు!
X

ముంబై: దేశంలోని రెండు అతిపెద్ద సంస్థలు రిలయన్స్ రిటైల్, అదానీ గ్రూప్‌లు దివాలా ప్రక్రియలో ఉన్న ఫ్యూచర్‌ రిటైల్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) కోసం తుది బిడ్డింగ్ ప్రక్రియ నుంచి వైదొలగినట్టు తెలుస్తోంది. ఫ్యూచర్ రిటైల్‌ను దక్కించుకునేందుకు అంతగా తెలియని కంపెనీల నుంచి చివరి రౌండ్ బిడ్డింగ్‌లో ఆరు బిడ్లు వచ్చాయని పలు నివేదికలు తెలిపాయి. వాటిలో రియల్టీ సంస్థ స్పేస్ మంత్ర కంపెనీ అత్యధిక మొత్తానికి వేలం వేసింది. మిగిలిన బిడ్డర్లలో పినాకిల్ ఎయిర్, పాల్గన్ టెక్ ఎల్ఎల్‌సీ, లెహర్ సొల్యూషన్స్ కంపెనీలు విడివిడిగా ఫ్యూచర్ రిటైల్ కొనుగోలు కోసం దరఖాస్తులను సమర్పించాయి. అలాగే, గుడ్‌విల్ ఫర్నీచర్, సర్వాభిష్ట ఈ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఇతర బిడ్డర్ల జాబితాలో ఉన్నాయి. ఫ్యూచర్ రిటైల్ కోసం మొత్తం 49 ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)లు వచ్చాయి. గతంలో రిలయన్స్ రిటైల్, అదానీ గ్రూప్ కంపెనీలు ఈఓఐని సంపరించిన బిడ్డర్లలో ఉన్నాయి. గత నెలలో కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ(సీఐఆర్‌పీ)ను పూర్తి చేసేందుకు ఫ్యూచర్‌ రిటైల్‌కు అదనంగా 90 రోజుల సమయాన్ని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed