వడ్డీ రేట్ల తగ్గింపును మరింత ఆలస్యం చేయనున్న RBI!

by Harish |   ( Updated:2024-05-02 07:41:46.0  )
వడ్డీ రేట్ల తగ్గింపును మరింత ఆలస్యం చేయనున్న RBI!
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంచనాలకు మించి ద్రవ్యోల్బణం పెరగడంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. దీంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌‌బీఐ) కూడా వడ్డీ రేట్లను తగ్గించడాన్ని సంవత్సరం చివరి త్రైమాసికం వరకు ఆలస్యం చేస్తుందని తాజా బ్లూమ్‌బెర్గ్ సర్వే వెల్లడించింది. వరుస ఏడు సమావేశాల్లో కూడా ఆర్‌బీఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్యోల్బణం 4శాతం వద్ద స్థిరంగా ఉండకపోతే రేట్లను తగ్గించడం చాలా కష్టం అని గతంలో గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. మార్చిలో ద్రవ్యోల్బణం 5 శాతం కంటే తక్కువగా ఉంది, అయినప్పటికి ఆర్‌బీఐ లక్ష్యానికి పూర్తిగా చేరువకాలేదు. ప్రస్తుత రెపో రేటు 6.50 శాతం వద్ద ఉంది. ఎండ వేడి కారణంగా ఆహార ఉత్పత్తులు తగ్గి వాటి ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరుగుదలలో హెచ్చుతగ్గులు వస్తున్నాయి.

బ్లూమ్‌బెర్గ్ సర్వే ప్రకారం, ఆర్థికవేత్తలు తమ త్రైమాసిక ద్రవ్యోల్బణ అంచనాలను డిసెంబర్ వరకు కొద్దిగా తగ్గించారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 4.5 శాతం వద్ద మార్చకుండా ఉంచినట్లు సర్వేలో వెల్లడైంది. వడ్డీ రేట్లను మరింత తగ్గించడం ద్వారా తమ కరెన్సీ విలువ తగ్గే అవకాశం ఉందని భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు జాగ్రత్త పడుతున్నాయి. ఆసియాలో చాలా సెంట్రల్ బ్యాంక్‌లు రేట్ల తగ్గింపును ఆలస్యం చేస్తాయని, ముఖ్యంగా భారత్ ఈ సంవత్సరం రేట్ల తగ్గింపును చేయదని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. బ్లూమ్‌బెర్గ్ సర్వేలో ఆర్థికవేత్తలు జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి అంచనాలను 6.1శాతం నుండి 6.3 శాతానికి కొద్దిగా పెంచారు.

Advertisement

Next Story