RBI: థర్డ్‌ పార్టీ యాప్‌లకు కూడా పీపీఐల లింక్‌.. అనుమతించిన ఆర్‌బీఐ

by S Gopi |
RBI: థర్డ్‌ పార్టీ యాప్‌లకు కూడా పీపీఐల లింక్‌.. అనుమతించిన ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) యూపీఐ చెల్లింపుల్లో కీలక మార్పులను తీసుకొచ్చింది. థర్డ్-పార్టీ మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా యూపీఐ లావాదేవీలు చేయడానికి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్(పీపీఐ) వినియోగదారులకు అనుమతిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన పీపీఐ కస్టమర్లు ఇకమీదట థర్డ్ పార్టీ యాప్ నుంచి చెల్లింపులను పంపించడం, తీసుకోవడం జరపవచ్చు. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు చేయాలంటే బ్యాంకు అకౌంట్‌ను అదే బ్యాంకుకు చెందిన యూపీఐ యాప్ లేదా ఏదైనా థర్డ్‌ పార్టీ యాప్‌తో లింక్ చేయాలి. అదేవిధంగా పీపీఐలను జారీ చేసే యాప్‌లకు లింక్ చేసి యూపీఐ లావాదేవీలు జరుపుకోవాలి. పీపీఐల్లో ముందుగా నగదును వ్యాలెట్, ప్రీపెయిడ్ కార్డుల రూపంలో లోడ్ చేసుకోవచ్చు. ఆర్‌బీఐ తాజా ఆమోదంతో థర్డ్‌పార్టీ యాప్‌లకు కూడా పీపీఐలను లింక్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంటే యూపీఐ, వ్యాలెట్ వేర్వేరు కంపెనీలకు చెందినవైనా సరే కస్టమర్లు తమ వ్యాలెట్‌లలో దేన్నైనా యూపీఐ యాప్‌లతో లింక్ చేసుకోవచ్చు. కస్టమర్లు తమ వ్యాలెట్‌లో ఉండే నగదును ఇతర యూపీఐలలోనూ వాడుకోవచ్చు. ఉదాహరణకు ఫోన్‌పె, పేటీఎం వ్యాలెట్‌లో ఉంచిన నగదును వాడేందుకు ఆ సంస్థ యూపీఐ ఉపయోగించినప్పుడే చెల్లింపులు చేయాలి. తాజా మార్పుతో ఇతర యూపీఐల నుంచి కూడా ఫోన్‌పే వ్యాలెట్‌లోని సొమ్ముతో లావాదేవీలు నిర్వహించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed