Union Budget 2024: బడ్జెట్‌పైనే ఆశలన్నీ

by S Gopi |   ( Updated:2024-07-21 17:19:35.0  )
Union Budget 2024: బడ్జెట్‌పైనే ఆశలన్నీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఏడాది ప్రారంభంలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి సమగ్ర పద్దును ప్రకటించనున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరిలో వెలువరించిన ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో రైతులు, పేదలను ఆకట్టుకునే తరహాలో కొన్ని ప్రకటనలు చేశారు. సేవలు, ఇతర రంగాల అభివృద్ధికి కేటాయింపులు చేసినప్పటికీ కొన్ని రంగాల వారు మధ్యంతర బడ్జెట్ విషయంలో నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో అందరి చూపు పూర్తిస్థాయి బడ్జెట్‌పైనే ఉంది. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి, వ్యాపార వర్గాల నుంచి భారీగానే అంచనాలు వినిపిస్తున్నాయి. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నరేంద్ర మోడీ సర్కారు.. రైతులు, మహిళలు సహా వివిధ వర్గాల కోసం తాయిలాల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్‌గా అవతరించాలన్న లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మౌలిక సదుపాయాల కోసం మూలధన వ్యయాన్ని పెంచే దిశగా నిర్ణయాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. రికార్డు స్థాయిలో ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్‌ గత హయాంలో తమ సర్కారు సాధించిన విజయాలను చెబుతూనే.. భవిష్యత్తులో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యాలను ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో వివరించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యులు మొదలుకొని వేతన జీవుల వరకు.. స్టార్టప్ కంపెనీల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు.. నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు బడ్జెట్-2024 నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

వేతన జీవులు..

గడిచిన దశాబ్ద కాలంలో ప్రజల జీవన వ్యయాలు పెరిగాయి. ఈ సమయంలో మోడీ సర్కారే అధికారంలో ఉంది. అయినప్పటికీ పెరిగిన జీవనవ్యయానికి తగినట్టుగా వేతనజీవులకు ఆదాయపు పన్నుకు సంబంధించిన అంశంలో ఉపశమనం లభించలేదు. ప్రతి ఏటా బడ్జెట్‌లో అందుకు తగిన ప్రకటనలు ఉంటాయని ఆశిస్తున్నప్పటికీ వారి ఆశలు అడియాసలవుతున్నాయి. కాబట్టి ఈ బడ్జెట్‌లోనైనా రూ. 10 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి కొంతైనా ఉపశమనం ఉంటుందనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. పన్ను రేట్ల తగ్గింపుతో పాటు రూ. 5 లక్షల వరకు పూర్తిగా పన్ను మినహాయింపు ఉండొచ్చని భావిస్తున్నారు.

పన్నులు..

ఎన్నికలు పూర్తయిన దగ్గరి నుంచి సమగ్ర బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచడం, కొత్త ఆదాయ పన్ను విధానంలో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మూలధన లాభాల పన్నును సరళీకరించడం వంటి డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తోంది. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 50,000 నుంచి రూ. 1,00,000కు పెంచాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే, కొత్త ఆదాయపు పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు చేయాలని ఎక్కువమంది కోరుకుంటున్నారు. ఈ బడ్జెట్‌లో పన్ను విధానంలో మార్పు ద్వారా మూలధన లాభాల పన్ను విధానాన్ని మరింత సులభతరం చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం మూలధన ఆస్తులను గరిష్ఠంగా 2-3 విభాగాలుగా వర్గీకరించాలని సూచిస్తున్నారు.

సామాజిక సంక్షేమం..

గత హయాంలో ప్రధాని మోడీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపైనే ఎక్కువ దృష్టి సారించింది. అదే సమయంలో కొవిడ్-19 మహమ్మారి, భౌగోళిక పరిణామాలు, ద్రవ్యోల్బణం మధ్య ప్రజల కోసం మోడీ సర్కారు సామాజిక, సంక్షేమం కోసం బాగానే ఖర్చు చేసింది. ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా గ్రామీణ స్థాయిలో పథకాలపై ఖర్చు పెంచవచ్చనే అంచనాలున్నాయి. ముఖ్యంగా భారీ స్థాయిలో గృహ నిర్మాణం, గ్రామీణ రోడ్ల నిర్మాణం, ఉద్యోగాల కల్పన, ప్రజారోగ్య బీమాపై ఎక్కువ పనిచేయనుంది. అలాగే, మహిళల కోసం కొత్త పథకాలు ప్రకటించవచ్చని విశ్లేషణలు కనిపిస్తున్నాయి.

తయారీ రంగంపై దృష్టి..

మొదటి టర్మ్‌లో స్థానిక ఉత్పత్తిని పెంచేందుకు విస్తృతంగా పనిచేసిన మోడీ ప్రభుత్వం ఈసారి పద్దులోనూ మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకాన్ని మరిన్ని రంగాలకు విస్తరించవచ్చు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఈ) ఆర్థిక కష్టాలను తొలగించే కొత్త పథకాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకోసం రూ.10 వేల కోట్లకుపైగా కేటాయింపులు ఉండనున్నట్టు భావిస్తున్నారు.

జీఎస్టీ..

సాధారణంగా యూనియన్ బడ్జెట్ సమయంలో ఎక్కువగా ఆదాయపు పన్ను, కస్టమ్స్ చట్టాల మార్పులపై దృష్టి సారిస్తూ ఉంటారు. అయితే, ఈసారి బడ్జెట్ సందర్భంగా జీఎస్టీకి సంబంధించిన అనేక అంశాలు చర్చలో ఉన్నాయి. ముఖ్యంగా తయారీ నుంచి అనేక కంపెనీలు జీఎస్టీ అంశంపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందనను ఆశిస్తున్నాయి. ఎంట్రీ-లెవల్ నుంచి లగ్జరీ ఉత్పత్తుల వరకు జీఎస్టీలో 5-12 శాతం మేర కోత విధించాలని కోరుతున్నాయి. దీనివల్ల స్థానిక తయారీని పెంచడం, ఉద్యోగాల సృష్టికి వీలుంటుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.

* భారత అంతరిక్ష సంఘం ఉపగ్రహ ప్రయోగ సేవల్లో గ్రౌండ్ వెహికల్స్, లాంచ్ వెహికల్స్‌పై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నాయి.

* ప్రయాణ, పర్యాటక పరిశ్రమ రూ. 7,500 కంటే ఎక్కువ ఖరీదైన గదులుండే హోటళ్లకు జీఎస్టీ మినహాయింపు, వీటిని 12 శాతం జీఎస్టీ విభాగంలోకి చేర్చాలనే డిమాండ్ ఉంది.

* జీఎస్టీ నిర్మాణాన్ని సరళీకృతం చేయాలని, గ్లోబల్ మార్కెట్లో పోటీతత్వం కోసం పన్ను అసమానతలను పరిష్కరించాలని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.

వ్యవ'సాయం'..

వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఈ రంగంలో డిజిటల్ వినియోగం పెంచే చర్యలు ఉండాలనే ఆశలున్నాయి. అలాగే, ఫుడ్ ప్రాసెసింగ్ వాల్యూ చెయిన్‌ను బలోపేతం చేయడం, పంట దిగుబడి తర్వాత నష్టాలను తగ్గించేందుకు, నాణ్యమైన ఉత్పత్తులను సకాలంలో రవాణా చేసేందుకు నిల్వ, గ్రేడింగ్ సౌకర్యాలు, రవాణా నెట్‌వర్క్‌లను మెరుగుపరచాలనే డిమాండ్ ఉంది. ఎగుమతులను పెంచే నిర్ణయాలు, వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి మద్దతు, రైతుల ఉత్పత్తులకు విలువను పెంచేందుకు ప్రాసెసింగ్‌కు మించి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆదాయాన్ని పెంచే తరహా చర్యలు బడ్జెట్‌లో ఉండాలని నిపుణులు భావిస్తున్నారు.

టెలికాం, బ్యాంకింగ్ రంగాలు..

టెలికాం రంగంలో 4జీ, 5జీ నెట్‌వర్క్ పరికరాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ మాఫీ, పరిశ్రమ వేరియబుల్స్ లైసెన్స్ ఫీజుల మినహాయింపుపై స్పష్టత, ఎగుమతుల వృద్ధి కోసం నిర్ణయాలు ఉండాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

బ్యాంకింగ్ రంగంలోనూ పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఆర్థికవ్యవస్థ బలోపేతానికి కొన్నిటిని ప్రైవేటీకరణ ప్రక్రియను చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, డిపాజిటర్లకు పన్ను ఉపశమనం, పొదుపును ప్రోత్షించే చర్యలు ఉంటాయనే అంచనాలున్నయి.

ఇవి కాకుండా అనేక రంగాల నుంచి ప్రభుత్వానికి వినతులు అందాయి. వృద్ధి దశలో అనేక పరిశ్రమలు తగిన ప్రోత్సాహకాలు, మద్దతు ఈ సమయంలో కీలకమని ఆర్థిక మంత్రికి విన్నవించాయి.

అవేంటంటే..

* ఐటీ రంగం డిజిటలైజేషన్, సాంకేతిక పురోగతిని కోరుకుంటోంది.

* స్పెషాలిటీ కెమికల్స్ పరిశ్రమ మూలధన వ్యయం కోసం వేగవంతమైన ఆమోదం లభించడం, ఆర్అండ్‌డీ ప్రోత్సాహకాలను కోరుతోంది.

* ఉక్కు రంగం ముడి పదార్థాలపై పన్ను తగ్గింపు, అధిక దిగుమతి సుంకాలను ఆశిస్తోంది. చైనీస్ స్టీల్‌పై పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఈ చర్యలు తమకు వృద్ధి, స్థిరత్వాన్ని ఇస్తాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.

* డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ), సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త రంగాలు కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని ఆశిస్తున్నాయి. ఈ రంగాలపై దృష్టి సారించడం ద్వారా భారత్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చవచ్చని ఆయా రంగాల నిపుణులు భావిస్తున్నారు.

* బంగారంపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 15 శాతం నుంచి తగ్గించాలని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

* సరఫరా అడ్డంకులను తగ్గించడం, లాజిస్టిక్‌లను మెరుగుపరచడంపై దృష్టి సారించి, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు.

* అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని పెంపొందించడం, క్రెడిట్‌ను సులభతరం చేయడం, జీఎస్టీని క్రమబద్ధీకరించడం వంటి నిర్దిష్ట సవాళ్లను బడ్జెట్ పరిష్కరించగలదని ఎంఎస్ఎమీ రంగం ఆశిస్తోంది.

* సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి, 'ఇన్నోవేషన్ హబ్‌ల' విస్తరణ, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలో మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్ కోసం హెల్త్‌కేర్ రంగం పెట్టుబడులను ఆశిస్తోంది.

* గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధించడానికి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, మెరుగైన గ్రిడ్ మౌలిక సదుపాయాలు, వినూత్న సాంకేతికతలకు గణనీయమైన కేటాయింపులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

* ఫిన్‌టెక్ సెక్టార్ మరింత విస్తృతంగా బ్యాలెన్స్ షీట్‌లను రూపొందించడం, డిజిటల్, ఏఐలను వినియోగం, ఫిన్‌టెక్‌ కంపెనీల మధ్య మెరుగైన భాగస్వామ్యం, సంస్కరణలకు నిర్ణయాలు.

Advertisement

Next Story