రూ. 5 లక్షల పైన చెక్కులకు రీ-వెరిఫికేషన్ తర్వాతే చెల్లింపులు: పీఎన్‌బీ!

by Harish |
రూ. 5 లక్షల పైన చెక్కులకు రీ-వెరిఫికేషన్ తర్వాతే చెల్లింపులు: పీఎన్‌బీ!
X

న్యూఢిల్లీ: చెక్కులకు సంబంధించిన మోసాల నుంచి వినియోగదారులను రక్షించేందుకు గానూ ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) రూ. 5 లక్షల కంటే ఎక్కువ విలువైన మొత్తాల చెక్కులకు చెల్లింపులు చేసేందుకు, సదరు చెక్‌ ఇచ్చిన వ్యక్తి నుంచి కీలక వివరాల పునఃధ్రువీకరణ తప్పనిసరి అని పీఎన్‌బీ తెలిపింది. పాజిటివ్‌ పే సిస్టమ్‌ (పీపీఎస్‌)లో భాగంగా ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

అధిక విలువ కలిగిన చెక్కుల విషయంలో మోసాలు జరగకుండా బ్యాంకు ఖాతాదారులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు వెల్లడించింది. పీపీఎస్‌ సదుపాయాన్ని ఉపయోగించుకోవడంలో తుది నిర్ణయం ఖాతాదారుదే ఉంటుంది. కానీ, రూ.5 లక్షలు లేదా అంతకు మించి విలువున్న చెక్కులకు పీపీఎస్ తప్పనిసరి చేయడంపై బ్యాంకులు నిర్ణయం తీసుకోవచ్చని ఆర్‌బీఐ మార్గదర్శకాలు చెబుతున్నాయి.

ఇందులో భాగంగానే, గతేడాది మార్చిలో పీఎన్‌బీ రూ. 10 లక్షల కంటే ఎక్కువ విలువైన చెక్కులకు పీపీఎస్ విధానం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా దీన్ని రూ. 5 లక్షలకు పైన చెక్కులకు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ విధానం వల్ల చెక్కుల చెల్లింపుల కోసం వినియోగదారులు బ్యాంకు అకౌంట్, చెక్ నంబర్లు, చెక్ ఆల్ఫా కోడ్, ఇష్యూ తేదీ, విలువ మొత్తం, ఎవరికి చెల్లింపులు చేయాలో సదరు వ్యక్తి పేరు వంటి వివరాలను తెలియజేయాలి. చెక్ క్లియరింగ్ కోసం పంపడానికి 24 గంటల ముందుగా ఈ వివరాలను బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది.

ఇంటర్నెట్, మొబైల్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, లేదా అకౌంట్ ఉన్న బ్రాంచ్ ద్వారా వివరాలు ఇవ్వొచ్చు. ఎన్‌పీసీఐ రూపొందించిన ఈ పీపీఎస్ విధానం ద్వారా అధిక విలువైన చెక్ వివరాలను పునః ధృవీకరణ చేయడం ద్వారా బ్యాంకులు తమ వద్ద ఉన్న వివరాలతో సరిపోల్చుకున్న తర్వాతే చెక్ క్లియర్ చేసి చెల్లింపులు చేస్తాయి.

Advertisement

Next Story

Most Viewed