Rupee: రూపాయి విలువపై ఆందోళన లేదు, ఆర్‌బీఐ చూసుకుంటుంది: ఆర్థిక కార్యదర్శి

by S Gopi |
Rupee: రూపాయి విలువపై ఆందోళన లేదు, ఆర్‌బీఐ చూసుకుంటుంది: ఆర్థిక కార్యదర్శి
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత కరెన్సీ గత కొన్ని వారాలుగా కొత్త కనిష్టాలకు పతనవుతూనే ఉంది. దీనికి సంబంధించి తాజాగా ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండె స్పందిస్తూ.. భారత రూపాయి ఫ్రీ-ఫ్లోటింగ్ కరెన్సీ అని, ఎవరూ నియంత్రించలేనిది, స్థిరమైన ధర అనేది ఉండదన్నారు. అంతర్జాతీయ పరిణామాలకు ఏర్పడే హెచ్చుతగ్గులపై ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకెళ్తుండటం కూడా రూపాయి మారకంపై ప్రభావం చూపుతోందని తెలిపారు. సోమవారం అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ మరోసారి ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో క్షీణించి రూ. 87.29కి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే తుహిన్ కాంత పాండె రూపాయి బలహీనతపై వివరణ ఇచ్చారు. రూపాయి అస్థిరతపై ఆందోళన చెందడం లేదని, దీనిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) చూసుకుంటుందన్నారు. కాగా, తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్‌లను ప్రకటించారు. ముఖ్యంగా మెక్సికో, కెనడా, చైనా దేశాలపై అధిక పన్నులు విధించడంతో డాలర్ బలపడింది. ఫలితంగా మన కరెన్సీపై ఒత్తిడి కనిపించింది. ఇప్పటికే విదేశీ నిధుల ఉపసంహరణ, భౌగోళిక రాజకీయ పరిణాలకు బలహీనంగా ఉన్న రూపాయి మారకం, ట్రంప్ నిర్ణయంతో మరింత ఒత్తిడికి లోనైందని తుహిన్ కాంత పాండె వెల్లడించారు.

Next Story

Most Viewed