Income Tax: పాత పన్ను విధానాన్ని తొలగించే ఆలోచన లేదు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

by S Gopi |
Income Tax: పాత పన్ను విధానాన్ని తొలగించే ఆలోచన లేదు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: పాత పన్ను విధానాన్ని రద్దు చేసే ఆలోచన లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. మంగళవారం ఇండియా టుడె-బిజినెస్ టుడె నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి దీనిపై వివరణ ఇచ్చారు. దేశంలో కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పాత పన్ను విధానం తొలగిస్తారనే ఊహాగానాలు పెరిగాయి. ఇటీవల ప్రకటించిన 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం, పాత విధానానికి సంబంధించి ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. తాజాగా, దీని గురించి మాట్లాడుతూ.. పాత పన్నుల విధానాన్ని రద్దు చేయాలనే ప్రతిపాదన ఏదీ రాలేదు. పన్నుల చెల్లింపు ప్రక్రియ సరళంగా ఉండాలనే కారణంతోనే కొత్త పన్నుల విధానం తీసుకొచ్చాం. 1961లో అమల్లోకి వచ్చిన పాత ఆదాయపు పన్ను చట్టం చాలా అంశాలతో కూడుకున్నది. దానికి అనేక మార్పులు, చేర్పులు చేయాల్సి ఉన్నందున కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని భావించిందన్నారు. కొద్దిరోజుల్లో ప్రవేశపెట్టబోయే కొత్త ఆదాయపు పన్ను బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజలు పాత పన్ను విధానంలో ఉన్న మినహాయింపులు తీసుకున్నంత కాలం, దాన్ని రద్దు చేసే ఆలోచన తనకు లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

జీఎస్టీ రేట్లపై..

జీఎస్టీ పన్ను రేట్ల హేతుబద్దీకరణపై సమీక్ష ప్రక్రియ దాదాపు పూర్తయిందని, జీఎస్టీ కౌన్సిల్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక మంత్రి చెప్పారు. మూడేళ్ల క్రితమే జీఎస్టీ రేట్లను సరళీకృతం చేసే పని ప్రారంభమైంది. సరైన సంస్కరణలు తీసుకొచ్చేందుకు, రోజువారీ వినియోగ వస్తువులకు సంబంధించి సమగ్రంగా సమీక్ష అవసరం. వీలైనంత తక్కువ రేట్లు, పన్ను శ్లాబులు ఉండాలనేది తమ ఉద్దేశమని, జీఎస్టీ కౌన్సిల్ త్వరలో ఇందుకనుగుణంగానే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) 5, 12,18,28 శాతం వంటి నాలుగు శ్లాబులలో అమలవుతోంది. లగ్జరీ, డీమెరిట్ వస్తువులపై అత్యధికంగా 28 శాతం, ప్యాక్‌డ్ ఫుడ్ సహా నిత్యావసరాలపై అత్యల్ప 5 శాతం జీఎస్టీ అమలవుతోంది.

Next Story

Most Viewed