Cafe Coffee Day: కాఫీ డే కు భారీ ఊరట.. NCLT ఆదేశాలపై స్టే

by Harish |
Cafe Coffee Day: కాఫీ డే కు భారీ ఊరట.. NCLT ఆదేశాలపై స్టే
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేఫ్ కాఫీ డే పేరుతో రిటైల్‌ చైన్‌ను నిర్వహిస్తున్న దాని మాతృ సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(CDEL)కు భారీ ఊరట లభించింది. దివాలా చర్యలకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌(NCLT) ఇచ్చిన ఆదేశాలపై అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (NCLAT) బుధవారం స్టే విధించింది. దీంతో కాఫీ డే దివాలా ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది. సీఈవో మాళవిక హెగ్డే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన చెన్నైకి చెందిన అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌, NCLT ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ తాజాగా మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది. తదుపరి విచారణ జరిగే వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది.

అంతకుముందు ఐడీబీఐ ట్రస్టీ షిప్ సర్వీసెస్ లిమిటెడ్(IDBITSL), కాఫీ డే రూ.228.45 కోట్లు చెల్లించడంలో విఫలం అయిందని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ తరువాత ఎన్‌సీఎల్‌టీ బెంగళూరు బెంచ్ దివాలా చర్యలను ప్రారంభించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా మధ్యవర్తిని సైతం ఏర్పాటు చేసింది. కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌‌కు కాఫీ డే షాపులతో పాటు కన్సల్టెన్సీ సేవలు, కాఫీ గింజల అమ్మకం వంటి వ్యాపారాలు సైతం ఉన్నాయి. 2019 జులైలో కంపెనీ ఛైర్మన్‌ వీజీ సిద్ధార్థ మృతి చెందడంతో కాఫీ డే కు కష్టాలు మొదలయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed