మరింత భారం కానున్న హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణాల ఈఎంఐ!

by srinivas |
మరింత భారం కానున్న హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణాల ఈఎంఐ!
X

న్యూఢిల్లీ: ప్రముఖ మార్టగేజ్ సంస్థ హెచ్‌డీఫ్‌సీ గృహ రుణాలపై ప్రభావం చూపే ప్రామాణిక రుణ రేటు రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు(ఆర్‌పీఎల్‌ఆర్‌)ను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలోనే ఆర్‌పీఎల్ఆర్‌ను పెంచిన హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్‌డీఎఫ్‌సీ) పది రోజుల వ్యవధిలోనే మరోసారి పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతేకాకుండా ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటివరకు సంస్థ కీలక రుణ రేట్లను ఆరు సార్లు పెంచింది. సంస్థ నిర్ణయం కారణంగా ప్రజలు తీసుకునే గృహ రుణాలపై నెలవారీ వాయిదా(ఈఎంఐ) మరింత భారం కానుంది. పెంచిన రేట్లు మంగళవారం నుంచే అమలవుతాయని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ పేర్కొంది. కాగా, గడిచిన మూడు నెలల కాలంలో అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రెపో రేటును 140 బేసిస్ పాయింట్లతో 5.40 శాతానికి పెంచింది. దీంతో కీలక వడ్డీ రేట్లు కరోనాకు ముందు స్థాయి కంటే ఎక్కువగా, 2019 తర్వాత అత్యధికంగా ఉన్నాయి. రానున్న నెలల్లోనూ ఆర్‌బీఐ మరింత పెంపు నిర్ణయాన్ని తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల బ్యాంకులు వివిధ రుణాల వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణ రేట్లను పెంచాయి.

Advertisement

Next Story