మరో 10,000 మందిని తొలగించిన మెటా!

by Harish |
మరో 10,000 మందిని తొలగించిన మెటా!
X

వాషింగ్టన్: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. గతేడాది నవంబర్‌లో 11,000 మందిని తొలగించిన సంస్థ ఈసారి మరో 10 వేల మందిని తీసేస్తున్నట్టు మంగళవారం ప్రకటనలో తెలిపింది. దీంతో రెండో రౌండ్‌లో భారీ తొలగింపులను ప్రకటించిన టెక్ దిగ్గజంగా నిలిచింది. లేఆఫ్స్‌కు సంబంధించి మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులకు పంపిన సందేశంలో తెలిపారు.

ఇదే సమయంలో గతంలో ఓపెన్ రోల్ విభాగంలో ప్రకటించిన ఐదు వేల మందిని కూడా నియమించుకోట్లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని గతంలోనే చెప్పాం. వ్యాపార పనితీరుని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది కఠిన నిర్ణయమే అయినప్పటికీ ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో లేఆఫ్స్ తప్పట్లేదని మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు.

ప్రస్తుత మాంద్యం పరిస్థితులు కొన్నాళ్ల పాటు కొనసాగవచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. మెటా గత కొంతకాలంగా ప్రకటనల ఆదాయం లేకపోవడంతో ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాలను వేగవంతం చేసింది. అందులో భాగంగా మెటా చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో లేఆఫ్స్ చేపట్టింది.

Advertisement

Next Story