Bangladesh: దేశీయ కంపెనీలను ఇరకాటంలో పడేసిన బంగ్లాదేశ్ సంక్షోభం

by S Gopi |
Bangladesh: దేశీయ కంపెనీలను ఇరకాటంలో పడేసిన బంగ్లాదేశ్ సంక్షోభం
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభ ప్రభావం భారతీయ కంపెనీలపై పడుతోంది. బంగ్లాదేశ్‌లో మూడు పర్యాయాలు ప్రధాన మంత్రిగా ఉన్న షేక్ హసీనా రిజర్వేషన్లపై తీవ్రస్థాయిలో ముదిరిన తిరుగుబాటుతో దేశం విడిచారు. దీంతో భారత్‌కు చెందిన పలు బహుళజాతి సంస్థలు ఇరకాటంలో పడ్డాయి. రాజకీయ సంక్షోభం, కార్యకలాపాల నిర్వహణ సహా ఇతర కారణాలతో ఆయా కంపెనీల వ్యాపారాలు ప్రభావితం అవుతున్నాయి. మూడువైపులా భారత్‌తో సరిహద్దును కలిగిన పొరుగు దేశంగా బంగ్లాదేశ్‌తో పలు ఎంఎన్‌సీ కంపెనీలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి.

ఎఫ్ఎంసీజీ కంపెనీలు..

వాటిలో.. ఎఫ్ఎంసీజీ దిగ్గజం మారికో బంగ్లాదేశ్‌లో మంచి వ్యాపారం నిర్వహిస్తోంది. కంపెనీకి ఎందిన హెయిర్-కేర్ బ్రాండ్లు నిహార్, పారాచూట్ కాకుండా, మారికో లివాన్, మెన్ హెయిర్-కేర్ బ్రాండ్ బియర్డొ, ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్ సఫోలా యాక్టివ్ ఉత్పత్తులను ఆ దేశ మార్కెట్లో విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ బంగ్లాదేశ్‌లో రూ. 1,413.6 కోట్ల ఆదాయం నమోదు చేసింది. మారికోకు బంగ్లాదేశ్ మార్కెట్ కీలకంగా ఉంది. ఎక్కువ లాభదాయకత కలిగి ఉంది. బంగ్లా మార్కెట్‌లో మారికోకు గణనీయమైన ఆస్తులు ఉన్నాయి. దాని వార్షిక నివేదిక ప్రకారం, మారికో బంగ్లాదేశ్ 31 మార్చి 2023 నాటికి రూ. 167 కోట్ల విలువైన ప్రస్తుత ఆస్తులను కలిగి ఉంది. మరో ఎఫ్ఎంసీజీ కంపెనీ డాబర్ ఇండియా కూడా బంగ్లాదేశ్ మార్కెట్ నుంచి 1 శాతం వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఈ కంపెనీ బంగ్లాదేశ్‌లో తన హెయిర్-ఆయిల్ బ్రాండ్ వాటికా, ఓడొనిల్ ఫ్రెషనర్ లాంటి వాటిని విక్రయిస్తోంది. డాబర్ ఇండియాకు ఆ దేశంలో స్వంతంగా తయారీ ప్లాంటు కూడా ఉంది.

అదానీ గ్రూప్..

మరో భారతీయ కంపెనీ అదానీ గ్రూప్ సైతం బంగ్లాలో సింగపూర్‌కు చెందిన విల్మార్ భాగస్వామ్యంతో వ్యాపారం నిర్వహిస్తోంది. వంటనూనె బ్రాండ్ ఉత్పత్తిని విక్రయిస్తోంది. అలాగే, ఢాకా కేంద్రంగా ఉన్న ఆవాల నూనె రూపచంద, పామాయిల్ బ్రాండ్ మీజెన్ లాంటి బ్రాండ్ల మార్కెటింగ్ కార్యకలాపాలను చూస్తోంది. దాంతో పాటే అదానీ విల్మార్ ఫార్చ్యూన్ బ్రాండ్, కింగ్స్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను విక్రయిస్తోంది. బంగ్లాదేశ్‌లో సంస్థ రూ. 16 వేల కోట్ల మార్కెట్‌ను కలిగి ఉంది. అదానీ గ్రూప్‌నకే చెందిన అదానీ పవర్ కూడా బంగ్లాదేశ్‌లో మెరుగైన వ్యాపారం నిర్వహిస్తోంది. జార్ఖండ్ నుంచి బంగ్లాదేశ్ గ్రిడ్‌కు అనుసంధానం కలిగిన 400కేవి డెడికేటెడ్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ద్వారా 25 ఏళ్లకు 1,496 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్‌ను సరఫరా చేస్తోంది.

Advertisement

Next Story