మార్కెట్ వాల్యూలో ఎస్‌బీఐకి చేరువగా ఎల్ఐసీ

by S Gopi |
మార్కెట్ వాల్యూలో ఎస్‌బీఐకి చేరువగా ఎల్ఐసీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) మంగళవారం ర్యాలీలో తొలిసారిగా లిస్టింగ్ ధరను అధిగమించింది. 2022, మే మూడవ వారంలో ఎల్‌ఐసీ మార్కెట్లలో లిస్టింగ్‌ అయిన సంగతి తెలిసిందే. ఇష్యూ ధర రూ.949గా కంపెనీ నిర్ణయించినప్పటికీ 8.11 శాతం నష్టంతో రూ.872 వద్ద లిస్టయ్యింది. ఆ తర్వాత నుంచి స్టాక్‌ క్రమంగా బలహీనపడింది. గతేడాది మార్చిలో అత్యంత కనిష్ఠం రూ.530కి చేరింది. అనంతరం పుంజుకున్నప్పటికీ ఇష్యూ ధర కంటే దిగువగానే ట్రేడయింది. 2023, నవంబర్‌లో ఎల్ఐసీ కొత్తగా జీవన్‌ ఉత్సవ్‌ పేరుతో పాలసీని విడుదల చేసింది. ఐదేళ్లు కడితే జీవితాంతం 10 శాతం చొప్పున గ్యారెంటీ ఆదాయం వచ్చే ఈ పాలసీ ప్రకటనతో కంపెనీ షేరు పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ షేర్ ర్యాలీతో మార్కెట్ క్యాప్ పరంగా గత రెండు నెలల్లో సుమారు రూ. 1.8 లక్షల కోట్లు పెరిగింది. దీంతో 2023, నవంబర్ 16న రూ. 3.85 లక్షల కోట్లుగా ఉన్న ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ ఈ ఏడాది జనవరి 16 నాటికి రూ. 5.65 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఎల్ఐసీ షేర్లు 46 శాతం పెరిగి రూ. 893.50కి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఆస్తుల ద్వారా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్ సైతం 2023, నవంబర్ 16న రూ. 5.22 లక్షల కోట్ల నుంచి 2024, జనవరి 16 నాటికి రూ. 5.68 లక్షల కోట్లకు చేరింది. దీంతో ఎల్ఐసీ సంస్థ ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్‌ను అధిగమించేందుకు చేరువలో నిలిచింది. ఇరు సంస్థల మధ్య మార్కెట్ క్యాప్ వ్యత్యాసం గతేడాది నవంబర్‌లో రూ. 1.36 లక్షల కోట్ల నుంచి ఈ జనవరి 16కి రూ. 3,813 కోట్లకు తగ్గింది.

Advertisement

Next Story

Most Viewed