నెస్లె వ్యవహారాన్ని తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు

by S Gopi |
నెస్లె వ్యవహారాన్ని తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లె ఉత్పత్తుల్లో యాడెడ్ షుగర్స్ అధిక స్థాయిల్లో ఉన్నట్టు వచ్చిన ఆరోపణలపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. నెస్లె ఉత్పత్తులపై వచ్చిన ఆరోపణల్లో ఉన్న వాస్తవాలను తేల్చాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఐ)ని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే ఎఫ్ఎస్ఎస్ఐకి లేఖ రాసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 'ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు, ముఖ్యంగా శిశువులు, చిన్నపిల్లల ఆరోగ్యం చాలా ముఖ్యం. భద్రతా ప్రమాణాలు పాటించకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని 'లేఖలో పేర్కొన్నారు. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో శిశువల కోసం తయారు చేసే ఉత్పత్తుల్లో కంపెనీ అధిక షుగర్ లెవల్స్ వాడుతున్నట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఆదేశాలిచ్చింది. ఇదే విషయంపై బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ కూడా నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై స్పందిచిన నెస్లె గడిచిన ఐదేళ్ల కాలంలో 30 శాతానికి పైగా షుగర్ లెవల్స్‌ను తగ్గించామని వివరణ ఇచ్చింది. ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తామని, పోషకాలు, నాణ్యత, భద్రత, రుచి విషయంలో రాజీ పడకుండా చూస్తున్నామని నెస్లె ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు.

Advertisement

Next Story