రికార్డు స్థాయిలో పడిపోయిన స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు!

by Harish |
రికార్డు స్థాయిలో పడిపోయిన స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు రికార్డు స్థాయిలో క్షీణించాయి. బలహీన గిరాకీ, గతేడాదికి సంబంధించి అధిక ఇన్వెంటరీల కారణంగా 2023, మొదటి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు 18 శాతం పడిపోయి 3.1 కోట్ల యూనిట్లకు తగ్గాయి.

గురువారం విడుదలైన పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, డిమాండ్ తగ్గడం, 2022లో తయారైన చాలా ఫోన్‌లు అమ్ముడవకుండా మిగిలిపోవడం, సెకెండ్‌హ్యాండ్ ఫోన్‌లు కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపించడం వంటి అంశాలు పరిశ్రమ నెమ్మదించడానికి కారణమని తెలిపింది.

ఇటీవల స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పటికే ఉన్న ఇన్వెంటరీలను వదిలించుకోవడంపై ఎక్కువ దృష్టి సారించాయి. ఇదే సమయంలో 5జీ వంటి కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అప్‌డేట్ చేసిన స్మార్ట్‌ఫోన్‌లు కొనేందుకే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని కౌంటర్ పాయింట్ రీసెర్స్ సీనియర్ అనలిస్ట్ శిల్పి జైన్ అన్నారు.

సమీక్షించిన త్రైమాసికంలో అమ్ముడైన వాటిలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ల వాటాయే 43 శాతం దాటింది. ఇది గతేడాది కంటే 23 శాతం పెరిగిందని ఆమె తెలిపారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్‌ల షిప్‌మెంట్ ఇలాగే ఉంటుందని, ద్వితియార్థంలో పండుగ సీజన్, 5జీ అప్‌గ్రేడ్ ద్వారా సాధారణ స్థితికి చేరుకోవచ్చని నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story