Forex Reserves: తొలిసారి 700 బిలియన్ డాలర్లు దాటిన భారత ఫారెక్స్ నిల్వలు

by S Gopi |
Forex Reserves: తొలిసారి 700 బిలియన్ డాలర్లు దాటిన భారత ఫారెక్స్ నిల్వలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: చారిత్రాత్మక రికార్డులను చెరిపేస్తూ భారత ఫారెక్స్ నిల్వలు కొత్త గరిష్ఠాలకు చేరాయి. సెప్టెంబర్ 27 నాటికి దేశీయ మారకపు నిల్వలు తొలిసారిగా రూ. 700 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటాయి. శుక్రవారం భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) డేటా ప్రకారం.. సమీక్షించిన వారానికి ఫారెక్స్ నిల్వలు 12.5 బిలియన్ డాలర్లు పెరిగి 704.89 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారానికి కూడా ఫారెక్స్ నిల్వలు 692.3 డాలర్ల వద్ద ఆల్‌టైమ్ హై స్థాయిల వద్ద ఉన్నాయి. దీంతో వరుసగా ఏడో వారం భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు గరిష్ఠాలను నమోదు చేశాయి. గత నెల అమెరికా ఫెడ్ తీసుకున్న వడ్డీ రేట్ల తగ్గింపు చర్యలు అనుకూలంగా మారడం, దేశీయ ఈక్విటీల్లో నిధులు పెరగడం వంటి అంశాలు దేశ కరెన్సీ రూపాయి బలపడేందుకు దోహదపడ్డాయి. శుక్రవారం సాయంత్రానికి అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.97 వద్ద ఉంది. గడిచిన ఆరు వారాల్లో భారత ఫారెక్స్ నిల్వలు సుమారు 32 బిలియన్ డాలర్లు పెరిగాయి. విదేశీ మారకపు మార్కెట్లో ఆర్‌బీఐ చొరవతో విదేశీ ఆస్తుల విలువ ప్రభావితమవుతుంది. అమెరికా డాలరుతో భారత కరెన్సీ రూపాయి మారకం క్షీణతను నియంత్రించేందుకు ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ద్వారా జోక్యం చేసుకుంటోంది.

Advertisement

Next Story