రూ.10.22 లక్షల కోట్లకు భారత ఆటోమొబైల్ పరిశ్రమ

by Harish |
రూ.10.22 లక్షల కోట్లకు భారత ఆటోమొబైల్ పరిశ్రమ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సంవత్సరం 2024లో భారత ఆటోమొబైల్ పరిశ్రమ 19 శాతం వృద్ధి చెంది రూ.10.22 లక్షల కోట్లకు చేరుకుందని బుధవారం ఒక నివేదిక తెలిపింది. కన్సల్టింగ్ సంస్థ ప్రైమస్ పార్ట్‌నర్స్ డేటా ప్రకారం, UV(యుటిలిటీ), SUV(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) సెగ్మెంట్‌లో బలమైన వృద్ధి కారణంగా ఎఫ్‌వై 24లో వాహన పరిశ్రమ ఆదాయం పెరిగింది. ఈ రెండు విభాగాల్లో గత ఏడాదితో పోలిస్తే వాల్యూమ్ 23 శాతం, ధర 16 శాతం పెరగగా, మొత్తం విలువ 39 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. చాలా మంది వినియోగదారులు హైబ్రిడ్, ఆటోమేటిక్‌కు మారడం, సన్‌రూఫ్‌కు ఆదరణ, ఎలక్ట్రిక్ వాహనాలకు (EVలు) మారడం వల్ల ఈ సెగ్మెంట్‌లో ధర పెరిగింది. UV, SUV విభాగాలు చాలా మంది భారతీయ వినియోగదారులకు మొదటి ప్రాధాన్య ఎంపికగా మారుతున్నాయి. ఇవే సెగ్మెంట్లలో అధిక, ఖరీదైన మోడళ్లను కూడా ఇష్టపడుతున్నారు, దీంతో డిమాండ్ మేరకు వాహనాల సగటు ధర పెరుగుతోందని నివేదిక పేర్కొంది.

మరోవైపు, ప్యాసింజర్ వెహికల్ (PV) విభాగంలో స్వల్పంగా ధర పెరుగుదల కారణంగా పరిమాణంలో 9 శాతం క్షీణత కనిపించింది, ఫలితంగా మొత్తం విలువలో 4 శాతం తగ్గింది. నివేదిక ప్రకారం, ద్విచక్ర వాహనాల విభాగంలో, భారతదేశం పరిమాణంలో 10 శాతం, విలువలో 13 శాతం పెరిగింది. త్రీ వీలర్ సెగ్మెంట్ పరిమాణంలో 16 శాతం, విలువలో 24 శాతం పెరిగింది. వాణిజ్య వాహనాల విభాగం పరిమాణంలో 3 శాతం, విలువలో 7 శాతం పెరిగింది.

రిజిస్టర్డ్ వాహనాల విషయంలో చైనా, అమెరికా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉండగా, విలువ పరంగా జపాన్, జర్మనీ వంటి దేశాల కంటే వెనుకబడి ఉందని నివేదిక పేర్కొంది. అలాగే, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో వాహనాల సగటు ధర తక్కువగా ఉంది. కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన అమ్మకాలు ఇప్పుడు తిరిగి పుంజుకుంటున్నాయని నివేదిక తెలిపింది.

Advertisement

Next Story