2023లో సగటున జీతాల పెరుగుదల 10.2 శాతం!

by Prasanna |
2023లో సగటున జీతాల పెరుగుదల 10.2 శాతం!
X

న్యూఢిల్లీ: భారత్‌లో ఈ ఏడాది సగటున జీతాల పెరుగుదల 10.2 శాతంగా ఉంటుందని ఓ నివేదిక తెలిపింది. ఇది 2022లో ఉన్న 10.4 శాతం కంటే కొంచెం తక్కువని కన్సల్టెన్సీ సంస్థ ఈవై తన తాజా 'ఫ్యూచర్ ఆఫ్ పే-2023' నివేదికలో వెల్లడించింది. బ్లూ-కాలర్ ఉద్యోగులు మినహా అన్ని స్థాయిలలో ఉన్న ఉద్యోగుల జీతాల పెరుగుదల స్వల్పంగా తక్కువ ఉండొచ్చని ఈవై అంచనా వేసింది. అత్యధికంగా ఈ-కామర్స్(11.9 శాతం), వృత్తి నిపుణుల సేవలు(12.5 శాతం), ఐటీ(10.8 శాతం) రంగాల్లో జీతాలు పెరగనున్నాయి. గతేడాది ఈ మూడు రంగాలు వరుసగా 14.2 శాతం, 13 శాతం, 11.6 శాతం చొప్పున సగటు వేతన పెంపును చూశాయి. ప్రస్తుతం దేశంలో అట్రిషన్(వలసల) రేటు క్రమంగా నెమ్మదిస్తోంది. ప్రస్తుతం 21.2 శాతంతో 2021 స్థాయిల కంటే తక్క్కువగా ఉంది. కెరీర్ వృద్ధిలో అవకాశాలు తగ్గడం, జీతాలు, ఉద్యోగ స్థాయి, గుర్తింపు లేకపోవడం వంటి అంశాలు అట్రిషన్ రేటుకు కారణమని నివేదిక తెలిపింది. ప్రధాన ఆర్థిక సంస్థలు(28.3 శాతం), ఈ-కామర్స్(27.7 శాతం), టెక్నాలజీ (22.1 శాతం) అట్రిషన్ రేటును నమోదు చేశాయి. తక్కువ అట్రిషన్ రేటు ఉన్న రంగాల్లో మెటల్స్ అండ్ మైనింగ్(8.2 శాతం), ఆతిథ్య రంగం(9.1 శాతం) ఏరోస్పేస్(10.9 శాతం) కలిగి ఉన్నాయి. గత కొంతకాలంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీ నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు అధిక డిమాండ్ కనిపిస్తోంది. సాధారణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కంటే వీరు 15-20 శాతం ఎక్కువ వేతనం పొందుతున్నారు. రిస్క్ మోడలింగ్, డేటా ఆర్కిటెక్చర్, బిజినెస్ అనలిటిక్స్ ఉద్యోగులకు 20-25 శాతం అధిక వేతనం అందుతున్నాయి. దేశంలోని దాదాపు 48 శాతం కంపెనీలు మెరుగైన నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు అధిక జీతం ఇచ్చేందుకు వెనకాడ్డం లేదు, 22 శాతం కంపెనీలు నైపుణ్యం ఉన్నవారికి ఇతర ప్రయోజనాలు అందిస్తున్నాయని ఈవై ఇండియా అడ్వైజరీ సర్వీసెస్ పార్ట్‌నర్ అభిషేక్ సేన్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed