పెట్టుబడులు, UPI సహకారంపై భారత్-కంబోడియా మధ్య చర్చలు

by Harish |
పెట్టుబడులు, UPI సహకారంపై భారత్-కంబోడియా మధ్య చర్చలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్- కంబోడియా మధ్య వాణిజ్యం, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, UPI ఆధారిత డిజిటల్ చెల్లింపుల్లో సహకారం కోసం రెండు దేశాల అధికారులు చర్చలు జరుపుతున్నారని వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కొత్త ఉత్పత్తులను గుర్తించడం, ద్వైపాక్షిక పెట్టుబడులు, భారతీయ ఫార్మా రంగంలో సహకారం ద్వారా ఆగ్నేయాసియా దేశం కంబోడియాతో వాణిజ్యాన్ని విస్తరించాలని భారత్ చూస్తుంది. దీనికోసం జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ (జెడబ్ల్యుజీటీఐ) సమావేశంలో ఈ అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయి.

ఈ సమావేశానికి వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ సిద్ధార్థ్ మహాజన్, కంబోడియా వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఇంటర్నేషనల్ ట్రేడ్ డైరెక్టర్ జనరల్ లాంగ్ కెమ్విచెట్ సహ అధ్యక్షత వహించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను మరింతగా పెంచే చర్యలను మహాజన్ ప్రస్తావించారు, పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో సహకారం, ఇతర యంత్రాంగాల ఏర్పాటుపై కూడా చర్చించారు. కంబోడియా కూడా భారత వ్యాపారాల కోసం అందించే అనేక పెట్టుబడి అవకాశాల గురించి వివరించింది. ముఖ్యంగా UPI ఆధారిత డిజిటల్ చెల్లింపుల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. భారత UPI చెల్లింపులు ఇప్పటికే UAE వంటి ఇతర దేశాల్లో ఉన్నాయి. కంబోడియాలో కూడా ఈ డిజిటల్ చెల్లింపుల ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది.

భారతదేశం- కంబోడియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2022-23లో USD 366.44 మిలియన్ల నుండి 2023-24లో USD 403.78 మిలియన్లకు ( వీటిలో ఎగుమతులు USD 185.39 మిలియన్లు, దిగుమతులు USD 218.4 మిలియన్లు) పెరిగింది. భారతదేశం నుండి కంబోడియాకు ప్రధానంగా ఔషధ ఉత్పత్తులు, గోవు మాంసం, మోటారు వాహనాలు (ఆటోలు, మోటార్ సైకిళ్ళు, విడి భాగాలు), ముడి చర్మాలు, తోలు, రసాయనాలు ఎగుమతి అవుతాయి. ప్రధాన దిగుమతులలో కూరగాయల నూనె, దుస్తులు, పాదరక్షలు ఉన్నాయి

Advertisement

Next Story