ఇండియలో 'హనుమాన్' AI చాట్‌బాట్

by Harish |   ( Updated:2024-02-21 09:00:19.0  )
ఇండియలో హనుమాన్ AI చాట్‌బాట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చాట్‌జీపీటీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దీనికి పోటీగా చాలా చాట్‌బాట్‌లు ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, కొన్ని ఐఐటీలు కలిసి భారత ప్రజల కోసం BharatGPT అనే చాట్‌జీపీటీని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన ఈవెంట్‌ను ముంబైలో నిర్వహించారు. దీనిలో చాట్‌జీపీటీ పనితీరును వివరించారు. ఇది ఆరోగ్య సంరక్షణ, పాలన, ఆర్థిక సేవలు, విద్య రంగాల్లో సేవలు అందిస్తుంది. దేశీయంగా 11 స్థానిక భాషల్లో పనిచేస్తుంది.

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, భారత ప్రభుత్వం, ఐఐటీల సహకారంతో ఈ మోడల్‌ను అభివృద్ధి చేశారు. దీనికి 'హనుమాన్' గా పేరు పెట్టారు. వచ్చే నెల నుంచి ఈ AI మోడల్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముంబైలో జరిగినటువంటి ఈవెంట్‌లో పనితీరును ప్రేక్షకులకు చూపించారు. ఒక బైక్ మెకానిక్ తమిళంలో ప్రశ్న అడిగి సమాధానం రాబట్టుకోగా, ఒక బ్యాంకర్ AI బాట్‌తో హిందీలో మాట్లాడాడు, అలాగే, హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చాట్‌బాట్ సహాయంతో కంప్యూటర్ కోడ్ రాశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కీలకంగా మారాలనే దేశ ఆశయాలకు ఇది పెద్ద ముందడుగు అని అధికారులు తెలిపారు.

హనుమాన్ స్పీచ్-టు-టెక్స్ట్ సామర్థ్యాలను కూడా అందిస్తుందని, ఇది మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని, ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగం చైర్మన్ గణేష్ రామకృష్ణన్ అన్నారు. అలాగే, రిలయన్స్ జియో నిర్దిష్ట ఉపయోగాల కోసం కొత్త మోడళ్లను నిర్మిస్తుందని ఆయన చెప్పారు. BharatGPT ప్రత్యేకమైనది, ఇది దేశంలోనే మొదటి ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్యం, విభిన్న రంగాల్లో ప్రధాన అవసరాలకు ఉపయోగపడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.

Advertisement

Next Story