గో ఫస్ట్ సంక్షోభం భారత విమానయాన వృద్ధిని ఆపదు: బోయింగ్!

by Harish |
గో ఫస్ట్ సంక్షోభం భారత విమానయాన వృద్ధిని ఆపదు: బోయింగ్!
X

న్యూఢిల్లీ: గో ఫస్ట్ సంక్షోభం భారత పౌర విమానయాన మార్కెట్ వృద్ధిని, ధోరణిని మార్చదని అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ శుక్రవారం తెలిపింది. అయితే, విమానాల లీజింగ్ అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అభిప్రాయపడింది. గో ఫస్ట్ వ్యవహారం నేపథ్యంలో ఎయిర్‌క్రాఫ్ట్ లీజుదారుల ఆందోళనలను, వారి సమస్యలను తగ్గించేందుకు వాటాదారులతో కలిసి పని చేయనున్నట్లు బోయింగ్ పేర్కొంది.

భారత్ మూడవ అతిపెద్ద, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో ఒకటి. అలాగే, భారత విమానయాన రంగానికి రాబోయే 20 ఏళ్లలో 2,200 కంటే ఎక్కువ విమానాలు అవసరమవుతాయని భావిస్తున్నట్టు బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తా అన్నారు.

నగదు కొరత వల్ల దివాలా ప్రక్రియకు వెళ్లిన పరిణామంపై మాట్లాడిన ఆయన ఒక విమానయాన సంస్థ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనడం వల్ల యాజమాన్యంతో పాటు ఉద్యోగులు, వాటాదారులందరూ ప్రభావితం అవుతారన్నారు. ఇది మొత్తం రవాణా వ్యవస్థపై ఒత్తిడి కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.

భారత్‌కు భారీ విక్రయ సామర్థ్యం ఉందని బోయింగ్ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్‌కు చెందిన కమర్షియల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ర్యాన్ వీర్ తెలిపారు. గో ఫస్ట్ సంక్షోభం వల్ల దేశ విమానయాన మార్కెట్ వృద్ధి ఆగదని సలీల్ గుప్తా చెప్పారు. భారత మార్కెట్లో విమానయాన రద్దీ 2041 నాటికి దాదాపు 7 శాతం వార్షిక వృద్ధి ఉంటుందని బోయింగ్ అంచనా వేసింది.

Advertisement

Next Story