Gautam Adani: రెండు నెలల్లో రూ. లక్షల కోట్ల సంపద కోల్పోయిన అదానీ

by S Gopi |   ( Updated:2025-02-21 15:14:12.0  )
Gautam Adani: రెండు నెలల్లో రూ. లక్షల కోట్ల సంపద కోల్పోయిన అదానీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బిలీయనీర్ అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలోనే తన సంపదలో భారీ మొత్తం నష్టపోయారు. అంతర్జాతీయంగా అత్యధిక నష్టాలను చూసిన సంపన్నుల్లో ఎలన్ మస్క్ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, ప్రపంచ బిలియనీర్ జాబితాలో 23వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ 2025లో ఇప్పటివరకు తన సంపదలో 11.9 బిలియన్ డాలర్ల(రూ. 1.04 లక్షల కోట్ల)ను కోల్పోయారు. దీంతో ఆయన మొత్తం సంపద రూ. 5.78 లక్షల కోట్లకు క్షీణించింది. ఇక, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 35.2 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 3 లక్షల కోట్ల)ను కోల్పోయారు. మస్క్ మొత్తం సంపద 397 బిలియన్ డాలర్ల(రూ. 34.38 లక్షల కోట్ల)కు తగ్గింది. గౌతమ్ అదానీ ఇటీవల అమెరికాలో లంచం ఆరోపణల కారణంగా న్యూయార్క్ కోర్టులో అభియోగాలను ఎదుర్కొన్నారు. 2020-2024 మధ్య సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి లంచాలు ఇచ్చారనే ఆరోపణలతో అదానీ కంపెనీ విలువ గణనీయంగా క్షీణించింది. అదానీ తర్వాత భారత్ నుంచి అత్యధికంగా సంపద నష్టాలను చూసిన వారిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద రూ. 25 వేల కోట్ల నష్టంతో రూ. 7.60 లక్షల కోట్లకు తగ్గింది. హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ రూ. 39.2 వేల కోట్ల నష్టపోయి రూ. 3.34 లక్షల కోట్లకు క్షీణించింది.

Next Story

Most Viewed