మేలో భారత మార్కెట్ల నుంచి రూ. 40 వేల కోట్ల నిధులు వెనక్కి!

by Manoj |
మేలో భారత మార్కెట్ల నుంచి రూ. 40 వేల కోట్ల నిధులు వెనక్కి!
X

ముంబై: భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు వరుసగా ఎనిమిదో నెలలో భారీగా అమ్మకాలను కొనసాగించారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో వ్దేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ ఏడాది మేలో భారత మార్కెట్ల నుంచి దాదాపు రూ 40,000 ఖోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు. దీంతో 2022లో ఇప్పటి వరకు దేశీయ మార్కెట్ల నుంచి రూ. 1.69 లక్షల కోట్ల విలువైన ఎఫ్‌పీఐ నిధులు వెనక్కి వెళ్లిపోయాయని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. పెరుగుతున్న భౌగోళిక- రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు, అధిక ద్రవ్యోల్బణం, వివిధ ఆర్థిక వ్యవస్థల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం వంటి కారణాలతో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు నిధులను ఉపసంహరించుకుంటున్నారని కోటక్ సెక్యూరిటీస్ రిటైల్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.

మే నెలకు సంబంధించి డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ. 39,993 కోట్లను ఉపసంహరించుకున్నారు. అమెరికా ఫెడ్ మరింత దూకుడుగా వడ్డీ రేట్లను పెంచనుందనే ఆందోళనల నేపథ్యంలోనే గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలను కొనసాగించారని మార్నింగ్‌స్టార్ ఇందియా, అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండటం వల్ల సరఫరా సమస్యలు ఏర్పడటం, అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికా ఇప్పటికే రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచింది. దేశీయంగా కూడా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచడం వల్ల ఆర్థిక వృద్ధిపై ప్రభావం కనిపిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. 2021, అక్టోబర్ నుంచి 2022, మే నెల వరకు గత ఎనిమిది నెలల్లో విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 2.07 లక్షల కోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed