రైటాఫ్ రుణాల రికవరీ రేటును పెంచాలని PSBలకు ఆదేశాలు!

by Harish |   ( Updated:2023-05-01 12:41:41.0  )
రైటాఫ్ రుణాల రికవరీ రేటును పెంచాలని PSBలకు ఆదేశాలు!
X

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో రైటాఫ్ చేసిన రుణాల నుంచి రికవరీ రేటు తక్కువగా ఉండటంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. సరైన చర్యల ద్వారా రికవరీ రేటును 40 శాతానికి పెంచాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను మంత్రిత్వ శాఖ కోరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రైటాఫ్(సాంకేతికంగా రద్దు) రుణాల రికవరీ రేటు 15 శాతం కంటే తక్కువగా ఉంది.

2022, మార్చితో ముగిసిన ఐదేళ్ల కాలానికి సంబంధించి ప్రభుత్వం రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) రూ. 7.34 లక్షల కోట్ల విలువైన రైటాఫ్‌ను ప్రకటించాయి. అందులో 14 శాతం మాత్రమే రికవరీ చేయగలిగాయి. అంటే, రూ. 1.03 లక్షల కోట్లను మాత్రమే మొండి రుణాల నుంచి వెనక్కి రప్పించగలిగాయి. ఇప్పటివరకు చేసిన రికవరీ తర్వాత బ్యాంకులు తమ నిరర్ధక ఆస్తుల(ఎన్‌పీఏ) పట్ల సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది, కానీ ఇంత తక్కువ స్థాయి రికవరీ ఆమోదయోగ్యం కాదని ఆర్థిక విభాగం అభిప్రాయపడింది.

ఈ అంశంపై పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్థిక సేవల విభాగం త్వరలో పీఎస్‌బీఐ సీనియర్ అధికారులతో సమావేశం కానున్నట్టు సమాచారం. ఆ సమావేశంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్, డెట్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌తో సహా వివిధ కోర్టులలో అటువంటి ఖాతాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలించనున్నారు. ముఖ్యంగా పెద్ద మొత్తాలలో రైటాఫ్ చేసిన ఖాతాల నుంచి మరింత చురుగ్గా రికవరీ చేపట్టేలా బ్యాంకులను ఆదేశించే అవకాశాలు ఉన్నాయి.

కాగా, ఆర్‌బీఐ డేటా ప్రకారం, 2021-22 వరకు ఆరేళ్లలో బ్యాంకులు రూ. 11.17 లక్షల కోట్ల మొండి బకాయిలను రైటాఫ్ చేశాయి. అందులో పీఎస్‌బీలు చేసిన మొత్తం రూ. 8,16,421 కోట్లు, ప్రైవేటు రంగ బ్యాంకులు రూ. 3,01,463 కోట్లను రద్దు చేశాయి.

Advertisement

Next Story