Stock Market: తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో ముగిసిన సూచీలు

by S Gopi |
Stock Market: తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో ముగిసిన సూచీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు నమోదయ్యాయి. గత వారాంతం అధిక లాభాలను చూసిన సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో రోజంతా లాభనష్టాల మధ్య కదలాడాయి. శనివారం అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరోసారి అదాని గ్రూప్ వ్యవహారంలో తీవ్రమైన ఆరోపణలు చేసింది. ముఖ్యంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛెయిర్‌పర్సన్‌పైనే ఆరోపణలు గుప్పించడంతో భారత మార్కెట్లలో కొంత ఒత్తిడి కనిపించింది. అయితే, మిడ్-సెషన్ సమయం నుంచి కోలుకున్నప్పటికీ ఆఖరి గంటలో మళ్లీ అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా కీలక రిలయన్స్ సహా బ్లూచిప్ స్టాక్స్‌ను మదుపర్లు ఎక్కువగా విక్రయించేందుకు సిద్ధపడటంతో నష్టాలు తప్పలేదు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 56.99 పాయింట్లు నష్టపోయి 79,649 వద్ద, నిఫ్టీ 20.50 పాయింట్ల నష్టంతో 24,347 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాలు రాణించగా, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, నెస్లె ఇండియా, ఎంఅండ్ఎం స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.96 వద్ద ఉంది.

Advertisement

Next Story