8,500 మంది తొలగింపులు ప్రకటించిన ఎరిక్సన్!

by Harish |
8,500 మంది తొలగింపులు ప్రకటించిన ఎరిక్సన్!
X

న్యూఢిల్లీ: గ్లోబల్ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు టెక్ కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగాలను కోల్పోగా, తాజాగా టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ ప్రపంచవ్యాప్తంగా 8,500 మందిని తీసేస్తున్నట్టు తెలిపింది. ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉద్యోగులకు పంపిన మెమోలో పేర్కొంది. ఇతర టెక్ కంపెనీలు ఆర్థిక పరిస్థితుల వల్ల ఉద్యోగులను ఇంటికి పంపినప్పటికీ, ఎరిక్సన్ నిర్ణయం టెలికాం పరిశ్రమ మొత్తంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ ప్రక్రియకు సంబంధించి ఆయా దేశాల స్థానిక నిబంధనలకు అనుగుణంగా చేపడతామని ఎరిక్సన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్జే ఎఖోమ్ అన్నారు. చాలావరకు దేశాల్లో ఈ వారంలోగా ప్రక్రియ గురించి సమాచారం ఇస్తామని ఆయన తెలిపారు. ఏయే ప్రాంతాల్లో అధిక తొలగింపులు ఉంటాయనే అంశాన్ని కంపెనీ వెల్లడించనప్పటికీ, ఉత్తర అమెరికాలోని వారు ఎక్కువ ప్రభావితం అవ్వొచ్చని, అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్లో తక్కువ మందిని తొలగించే వీలుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఎరిక్సన్ కంపెనీల్లో మొత్తం 1,05,000 మంది ఉండగా, ఇప్పటికే స్వీడన్‌లో 1,400 మందిని తొలగిస్తామని సోమవారం ప్రకటించింది.

Advertisement

Next Story