Elon Musk: ఒక్కరోజే రూ. 1.9 లక్షల కోట్ల సంపద కోల్పోయిన ఎలన్ మస్క్

by S Gopi |
Elon Musk: ఒక్కరోజే రూ. 1.9 లక్షల కోట్ల సంపద కోల్పోయిన ఎలన్ మస్క్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ బిలీయనీర్ ఎలన్ మస్క్ భారీ మొత్తంలో సంపదను కోల్పోయారు. గత కొన్ని వారాలుగా తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా షేర్లలో పతనం కారణంగా బుధవారం ఎలన్ మస్క్ సంపద ఒక్కరోజే 22.2 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 1.9 లక్షల కోట్లు) పోగొట్టుకున్నారు. ఎలన్ మస్క్ సంపదలో సగానికి పైగా వాటా ఉన్న టెస్లా కార్ల అమ్మకాలు క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా యూరప్‌లో కంపెనీ అమ్మకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యూరప్‌లో మొత్తం ఈవీ అమ్మకాలు పెరిగినప్పటికీ, టెస్లా కార్లు కొనేవాళ్లు కరువయ్యారు. ఫలితంగా జనవరిలో దాదాపు సగానికి పడిపోయింది. గత నాలుగు రోజులుగా బలహీనపడుతున్న టెస్లా షేర్లు బుధవారం కూడా ఏకంగా 7 శాతం కంటే ఎక్కువగా పతనమయ్యాయి. దీంతో నవంబర్ 7 తర్వాత టెస్లా మార్కెట్ విలువను మొదటిసారిగా 1 ట్రిలియన్ డాలర్ల కంటే దిగువకు కుదేలైంది. ఈ కారణంగానే ఎలన్ మస్క్ సంపదలో భారీ క్షీణత ఏర్పడింది. టెస్లా కార్ల అమ్మకాలకు తోడు ఎలన్ మస్క్ అమెరికా రాజకీయాల్లోకి ప్రవేశించడంతో కంపెనీపై సానుకూల వైఖరి నెమ్మదించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ(డోజ్) ద్వారా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే చర్యలకు ఎలన్ మస్క్ నాయకత్వం వహిస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ ప్రభుత్వ విధానాలు, టారిఫ్ సహా ఇతర పరిణామాలతో అమెరికా మార్కెట్లు దెబ్బతిన్నాయి. గత నాలుగు సెషన్‌లలో ప్రధాన సూచీ ఎస్అండ్‌పీ500 3 శాతం కంటే ఎక్కువ పతనమైంది.

Next Story