EVs: ఈవీ, ఫ్లెక్స్, సీఎన్‌జీ వాహనాలకు భారీ డిమాండ్

by S Gopi |
EVs: ఈవీ, ఫ్లెక్స్, సీఎన్‌జీ వాహనాలకు భారీ డిమాండ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల ఢిల్లీలో 'భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో-2025' సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సాంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఈవీ, ఫ్లెక్స్, సీఎన్‌జీ వాహనాలు ఎక్కువగా కనిపించాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో దేశీయంగా వాహన తయారీ సంస్థలు ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల తయారీపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోందని ఫిలిప్ కేపిటల్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ప్యాసింజర్, ద్విచక్ర వాహనాల విభాగంలో వినియోగదారులు పెట్రోల్, డీజిల్ కాకుండా ఇతర ఇంధన వాహనాలకు మారుతున్న ప్రధాన మార్పును సూచిస్తుందని నివేదిక అభిప్రాయపడింది. దేశీయ వాహన రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తద్వారా పరిశ్రమ వృద్ధి కూడా వేగంగా జరగనుందని, గత కొన్ని నెలల నుంచి ఎస్‌యూవీలు, ఈవీ, హైబ్రిడ్ మోడళ్లకు పెరుగుతున్న ఆదరణ మొత్తం ఆటోమొబైల్ రంగం అత్యంత వేగంగా మార్పులను లోనవుతున్న తీరుకు సంకేతంగా ఉంది. పెరుగుతున్న డిమాండ్ స్థాయిలో వాహన తయారీ కంపెనీలు సైతం కొత్త డిజైన్, మోడల్ వాహనాలను విడుదల చేయనున్నాయి. ఇదే సమయంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రీమియమైజేషన్ కారణంగా వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయపడింది. ఎక్కువ వాహనాలు మార్కెట్లోకి రావడం ద్వారా ఫుట్‌ఫాల్స్ పెరగడంతో పాటు ప్రెమియమైజేషన్ సగటు ధర పెరుగుదలకు కారణమవుతుందని పేర్కొంది.

Next Story