Air Ambulance: త్వరలో దేశవ్యాప్తంగా ఎయిర్ ఆంబులెన్స్‌లు

by S Gopi |
Air Ambulance: త్వరలో దేశవ్యాప్తంగా ఎయిర్ ఆంబులెన్స్‌లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: త్వరలో దేశీయంగా ఎయిర్ ఆంబులెన్స్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల ఎయిర్ ట్యాక్సీ సేవలు లభిస్తున్నప్పటికీ, మరింత సౌకర్యవంతంగా, సులభ ఎయిర్ సర్వీసులందించేందుకు ఎయిర్ ఆంబులెన్స్‌లకు వీలుంటుందని ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ స్టార్టప్ కంపెనీ ఈప్లేన్ చెబుతోంది. సోమవారం కంపెనీ ఏకంగా 788 ఎయిర్ ఆంబులెన్స్‌ల సరఫరా కోసం ఒప్పందాన్ని అంగీకరించినట్టు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందం విలువ 1 బిలియన్ డాలర్ల(రూ. 8,600 కోట్ల) కంటే ఎక్కువేనని కంపెనీ తెలిపింది. ఇరు కంపెనీల మధ్య ప్రస్తుతానికి నాన్-బైండింగ్ ఒప్పందమే జరిగింది. ఇందులో భాగంగా ఈప్లేన్ కంపెనీ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్(ఈవీటీఓఎల్) ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎయిర్ ఆంబులెన్స్ సేవలందించే కంపెనీ ఐసీఏటీటీ(ఐకాట్)కి సరఫరా చేయనుంది. వీటి ద్వారా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎయిర్ ఆంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకురావాలని ఐకాట్ భావిస్తోంది.

బ్యాటరీలతో నడిచే ఈవీటీఓఎ విమానాల అభివృద్ధి ద్వారా పట్టణ ప్రాంత ప్రయాణాల్లో సమూల మార్పులకు ప్రయత్నిస్తున్నాం. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లు టేకాఫ్, ల్యాండింగ్‌ను నిలువుగా చేయగలవు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఒకసారి ఛార్జింగ్ ద్వారా దాదాపు 110 కిలోమీటర్లు ప్రయాణించగలవని, భవిష్యత్తులో 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ కూడా పెంచవచ్చని ఈప్లేన్ వెల్లడించింది. దానివల్ల ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులను దాటుకుని ప్రయాణించే వీలుంటుంది. ఈ విభాగంలో ఇప్పటికే ఆర్చర్ ఏవియేషన్, సరళా ఏవియేషన్ వంటి కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈప్లేన్ కంపెనీ వచ్చే ఏడాది ఆఖరు నాటికి కమర్షియల్‌గా కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా ఉంది. ప్రారంభంలో 100 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఉత్పత్తి చేయనునట్టు కమెప్నీ వ్యవస్థాపకుడు సత్య చక్రవర్తి చెప్పారు. ఎయిర్ ట్యాక్సీల విభాగంలో ఇప్పటికే పోటీ ఉన్నందున ఎయిర్ ఆంబులెన్స్ కోసం తయారీని ప్రారంభించడం మార్కెట్లోకి తొందరగా వెళ్లేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు.

Next Story