అన్ని బ్యాంకుల వెబ్‌సైట్‌లలో 'డిపాజిట్ బీమా' క్యూఆర్ కోడ్ తప్పనిసరి!

by Vinod kumar |
అన్ని బ్యాంకుల వెబ్‌సైట్‌లలో డిపాజిట్ బీమా క్యూఆర్ కోడ్ తప్పనిసరి!
X

న్యూఢిల్లీ: డిపాజిట్ బీమా పథకం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఆర్‌బీఐ అనుబంధ డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కర్పొరేషన్(డీఐసీజీసీ) దేశంలోని అన్ని బ్యాంకులు వెబ్‌సైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌లలో డీఐసీజీసీ లోగో, క్యూఆర్ కోడ్‌లను ప్రదర్శించాలని కోరింది. ఆగష్టు 31లోగా దీన్ని అమలు చేయాలని తెలిపింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన పెంపొందేందుకు ఆర్‌బీఐతో సంప్రదించి డీఐసీజీసీతో నమోదు చేసుకున్న అన్ని బ్యాంకులు తమ లోగో, క్యూఆర్ కోడ్‌ను ఉంచాలని స్పష్టం చేసింది. దీనివల్ల వినియోగదారులు డీఐసీజీసీకి చెందిన డిపాజిట్ బీమా పథకం ఉన్న బ్యాంకులను సులభంగా గుర్తించేందుకు, దానికి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు వీలవుతుంది. బ్యాంకుల్లో రూ. 5 లక్షల వరకు డిపాజిట్లకు డీఐసీజీసీ బీమా అందజేస్తుంది.

ఇది అన్ని కమర్షియల్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు(ఎల్ఏబీ), పేమెంట్ బ్యాంకులు(పీబీ), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు(ఎస్ఎఫ్‌బీ), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు(ఆర్ఆర్‌బీ), సహకార బ్యాంకుల్లోని డిపాజిట్లను కవర్ చేస్తుంది. ముఖ్యంగా చిన్న డిపాజిటర్లను రక్షించడం, బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసాన్ని నింపేందుకు తాజా నిర్ణయం సహకరిస్తుందని డీఐసీజీసీ అభిప్రాయపడింది. ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో డిపాజిట్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి బీమా నమోదైన బ్యాంకుల సంఖ్య 2,027గా ఉంది. అందులో 140 కమర్షియల్ బ్యాంకులు, 43 ఆర్ఆర్‌బీలు, రెండు ఎల్ఏబీలు, ఆరు పీబీలు, 12 ఎస్ఎఫ్‌బీలు, 1,887 సహకార బ్యాంకులు ఉన్నాయి.

Advertisement

Next Story