Microsoft Windows: మైక్రోసాఫ్ట్ విండోస్‌ సేవలకు బ్రేక్.. ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్

by S Gopi |
Microsoft Windows: మైక్రోసాఫ్ట్ విండోస్‌ సేవలకు బ్రేక్.. ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన విండోస్‌లో శుక్రవారం పెద్ద ఎత్తున సాంకేతిక లోపం ఏర్పడింది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పలు కీలక సేవలు నిలిచిపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బ్యాంకులు మొదలుకొని మీడియా, విమానయాన సంస్థల ఐటీ సేవల్లో తీవ్ర అంతరాయం ఎదురైంది. అంతర్జాతీయంగా చాలామంది యూజర్లు తమ కంప్యూటర్ల స్క్రీన్‌పై ఎర్రర్ మెసేజ్‌తో పాటు షట్‌డౌన్ అవడం గానీ, రీస్టార్ట్ అవడం గానీ జరుగుతోందని చెప్పారు. భారత్, అమెరికా సహా అనేక దేశాల్లో ఇదే సమస్య ఉత్పన్నమైంది. ప్రభుత్వ, బ్యాంకింగ్ రంగ సేవల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. విండోస్‌లో సాంకేతిక లోపం వల్ల విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. కొన్ని విమానాలు ఆలస్యం కావడం, కొన్నిటిని రద్దు చేయడం వల్ల ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. దేశీయంగా కూడా ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్, ఇండిగో, ఆకాశ లాంటి ఎయిర్‌లైన్ కంపెనీలు బుకింగ్, చెక్-ఇన్ సేవలు నిర్వహించలేకపోయామని ప్రకటించాయి.

అనేక సేవల్లో గందరగోళం..

విండోస్‌లో ఏర్పడ్డ ఎర్రర్ వల్ల అనేక సేవలు నిలిచిపోయాయి. ప్రజల సాధారణ సేవలైన బ్యాంకింగ్, విమాన సర్వీసుల్లో ఇబ్బందులతో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. దేశీయంగా ప్రధన విమానయాన సంస్థలకు చెందిన బుకింగ్, చెక్-ఇన్‌లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్, ఇండిగో, ఆకాశ, విస్తారా కంపెనీలు ప్రణాణీకులకు చేత్తో రాసిన బోర్డింగ్ పాస్‌లను ఇచ్చారు. బెంగళూరు ఎయిర్‌పోర్టులోని టర్మినల్-1లో 90 శాతం విమానాలు నిలిచిపోయాయని సంబంధిత అధికారులు చెప్పారు. ఆస్ట్రేలియాలోనూ ఎయిర్‌పోర్టుల్లో విమానాలు నిలిచిపోయాయి. లండన్‌లోనైతే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సేవలు కూడా ఆగిపోయాయి. యూకేలోని స్కై న్యూస్ ప్రసారం, ఆస్ట్రేలియా టెలికామ్యూనికేషన్స్ కంపెనీ టెల్‌స్ట్రా కూడా ప్రభావితమైంది. ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసిన కొన్ని దేశాల్లోని పోలీసు వ్యవస్థలు కూడా దెబ్బతినడం గమనార్హం.

'ఫాల్కన్ సెన్సార్' అప్‌డేట్ సమస్య..

దీనిపై స్పందించిన మైక్రోసాఫ్ట్ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ అనే కంపెనీకి చెందిన 'ఫాల్కన్ సెన్సార్' సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్య వల్ల ఇది జరిగిందని ప్రకటించింది. ఇది సైబర్ దాడులను నియంత్రించేందుకు అభివృద్ధి చేశారు. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ రిలీజ్ అయినందునే ప్రపంచవ్యాప్తంగా ఎర్రర్ కనిపించింది. లోపాన్ని సరిదిద్ది సమస్యను పరిష్కరిస్తున్నామని క్రౌడ్ స్టైక్ కంపెనీ సీఈఓ జార్జ్ కర్ట్ చెప్పారు. విండోస్ సర్వర్లలో మాత్రమే ఈ ఈరర్ ఉందని, మ్యాక్, లైనక్స్ సర్వర్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం సైతం దీనిపై ప్రకటన విడుదల చేసింది.

కేంద్ర ఐటీ మంత్రి కీలక ప్రకటన..

మైక్రోసాఫ్ట్ విండోస్ ప్రభావంపై భారత ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం మధ్యాహ్నం స్పందించారు. విండోస్ ఎర్రర్‌పై మైక్రోసాఫ్ట్ కంపెనీతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని, కారణాలను గుర్తించినట్టు మంత్రి వెల్లడించారు. దీని పరిష్కారానికి అప్‌డేట్ విడుదలైనట్టు పేర్కొన్నారు. ఇదే సమయంలో ఈ ఎర్రర్‌కు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) ప్రభావితమవలేదని అశ్విని వైష్ణవ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సేవలను అందించే పాన్-ఇండియా కమ్యూనికేషన్ నెట్‌వర్క్.

మైక్రోసాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్ షేర్ల పతనం..

ఎక్కువ వినియోగంలో ఉండే సైబర్ సెక్యూరిటీలో అప్‌డేట్ కారణంగా మైకోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు, ఇతర పబ్లిక్ సర్వీసెస్ విఫలమయ్యాయి. ఈ ప్రభావం కారణంగా మైక్రోసాఫ్ట్ కంపెనీతో పాటు ఎర్రర్‌కు కారణమైన క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ షేర్లు పతనమయ్యాయి. మైక్రోసాఫ్ట్ షేర్ ప్రీ-మార్కెట్‌లో దాదాపు 2 శాతం కుదేలవగా, ఈ ఎర్రర్‌కు ప్రధాన కారణమైన క్రౌడ్ స్ట్రైక్ షేర్ ప్రీ-మార్కెట్‌లో 12 శాతానికి పైగా పతనమైంది.



Next Story