Congress: బడ్జెట్‌కు ముందు కాంగ్రెస్ కీలక నివేదిక విడుదల

by S Gopi |
Congress: బడ్జెట్‌కు ముందు కాంగ్రెస్ కీలక నివేదిక విడుదల
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఓ నివేదికను విడుదల చేసింది. ఆర్థికవ్యవస్థకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ 'రియల్ స్టేట్ ఆఫ్ ది ఎకానమి-2025' పేరు మీద దీన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా దేశంలో విపరీతంగా పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని ప్రస్తావిస్తూ ఈ నివేదికను రూపొందించారు. మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా యువతకు కావాల్సిన స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఆదాయ అసమానతలు కూడా పెరుగుతున్నాయి, ఆర్థికవ్యవస్థ నెమ్మదించింది, అంతకుముందు ఏడాది కంటే వృద్ధి చాలా క్షీణించింది. దేశంలో కొత్తగా ఉపాధి కల్పన జరగడంలేదని చిదంబరం విమర్శలు చేశారు. గత నాలుగైదేళ్లుగా వేతనాలు పెరగడంలేదు, ఆహారం, విద్య, ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో ఉంది. 2-3 ఏళ్లుగా ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. వీటన్నిటినీ అధిగమించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని చిదంబరం అసహనం వ్యక్తం చేశారు. ఈ నివేదికను మాజీ ఎంపీ రాజీవ్ గౌడ నేతృత్వంలోని బృందం రూపొందించింది.



Next Story